చేగొండి హరిరామజోగయ్య కుమారుడు రామదాసుపై టీడీపీ నేత వాసిరెడ్డి బాబీ విచక్షణారహిత దాడి
సంబంధంలేని వ్యవహారంలో టీడీపీ గూండాలతో అపార్టుమెంట్‌లోకి చొరబాటు
పోలీసుల ఎదుటే రామదాసు, ఆయన భార్య, కుమారుడు, గుమాస్తాపై పిడిగుద్దులు
పోలీసుస్టేషన్‌లోనూ కేసు పెట్టొద్దంటూ రాద్ధాంతం
ఆగ్రహం వ్యక్తంచేస్తున్న కాపు సంఘాలు
రాజీ చేసుకోవాలని రామదాసుపై పోలీసుల ఒత్తిడి
పోలీసుల తీరుపై కాపు సంఘాల నేతల మండిపాటు.. స్టేషన్ వద్ద ఆందోళన
వాసిరెడ్డి బాబీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
సాక్షి, రాజమహేంద్రవరం : రాజకీయ పలుకుబడి, అధికారం అండతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎదుటే విధ్వంసానికి పాల్పడుతున్నారు. కాపు నాయకుడు, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి రామదాసుపై తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి రాంబాబు కుమారుడు వాసిరెడ్డి బాబీ చేసిన దాడే ఇందుకు తాజా నిదర్శనం. బాబీ తన అనుచరులతో కలిసి రామదాసు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి వెళ్లి, పోలీసుల ఎదుటే దాడికి పాల్పడటంపై కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారం అండతో టీడీపీ నాయకులు, గూండాలు కాపులపై దాడి చేస్తే సహించేదిలేదని కాపు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. రామదాసుపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధంలేని వ్యవహారంలో దాడికి పాల్పడిన బాబీ
చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి వెంకట రామదాసు కుటుంబం మోడల్ కాలనీలోని పల్లవి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తోంది. బుధవారం రామదాసు భార్య మొక్కలకు నీళ్లు పోస్తుండగా అక్కడి వాచ్‌మేన్ దురుసుగా, అనుచితంగా ప్రవర్తించడంతో రామదాసు అతన్ని చీవాట్లు పెట్టాడు. దీంతో వాచ్‌మేన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వాసిరెడ్డి బాబీ సోదరి అతనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. సంబంధంలేని వ్యవహారమే అయినప్పటికీ బాబీ వెంటనే 15 మంది అనుచరులను వెంటేసుకుని పల్లవి ఎన్‌క్లేవ్‌లోకి చొరబడ్డాడు. వస్తూనే రామదాసుపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే రామదాసు ప్రకాశం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుళ్లు అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చి అడ్డగిస్తున్నప్పటికీ బాబీ, అతని అనుచరులు దాడి ఆపలేదు. రామదాసుతో పాటు అతని భార్య, వారి కుమారుడు సిద్ధార్థ, గుమాస్తా రాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ ప్రాంతాన్ని రణరంగంలా మార్చేశారు. గాయాలపాలైన బాధితులు ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, అక్కడికీ బాబీ, అతని అనుచరులు వచ్చి కేసు పెట్టొద్దంటూ రాద్ధాంతం చేశారు. దాడికి పాల్పడిన వాసిరెడ్డి బాబీని రూమ్‌లో కూర్చోబెట్టిన పోలీసులు.. బాధితులైన వెంకట రామదాసును, మిగిలిన వారిని రోడ్డుపైనే నిలబెట్టడం గమనార్హం.
రెండ్రోజులుగా ఎవరో అనుసరిస్తున్నారు..
ఇక.. హఠాత్తుగా వచ్చి తమపై దాడిచేశారని, రెండు రోజులుగా తాను ఎక్కడికి వెళ్లినా గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని చేగొండి రామదాసు మీడియా వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణరక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోపక్క.. రాజీ చేసుకోవాలని పోలీసులు రామదాసుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుసుకున్న కాపు సంఘాల నాయకులు ఆయనకు మద్దతుగా శనివారం సాయంత్రం ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరకు.. పోలీసులు బాబీ, అతని అనుచరులు ఐదుగురిని అరెస్టుచేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడితో అపార్ట్‌మెంట్ వాచ్‌మేన్ పోలీసుస్టేషన్‌కు వచ్చి రామదాసు, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపైనా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.
ప్రభుత్వం తీరుపై కాపు సంఘాల ఆగ్రహం
చేగొండి రామదాసుపై టీడీపీ గూండాలు దాడి చేయడంపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ చులకన భావనతోనే ఉందని ధ్వజమెత్తారు. కాపు సామాజికవర్గానికి చెందిన రామదాసుపై టీడీపీ గూండాలు దాడి చేసి మూడు రోజులైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు.
రౌడీలు, గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నారని, మాజీ హోంమంత్రి కుమారుడికే రాష్ట్రంలో రక్షణ లేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాపులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాపు సంఘాల నాయకులు ఆందోళన చేశారు.


