వెలుగునీడల ‘స్వాతంత్య్రం’ | Sakshi Editorial On India Independence and India Development | Sakshi
Sakshi News home page

వెలుగునీడల ‘స్వాతంత్య్రం’

Aug 15 2026 2:42 AM | Updated on Aug 15 2026 2:42 AM

Sakshi Editorial On India Independence and India Development

స్వతంత్ర భారతం నేటితో ఎనభయ్యో వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశం ఈ 21వ శతాబ్దిలో ఎటు పయనిస్తున్నదని తరచి చూసుకుని, చక్కదిద్దుకోవాల్సిన సందర్భం ఇది. 1947 ఆగస్టు 15 నాటికి ఈ దేశం 565 సంస్థానాలుగా ఉంది. వలస పాలకులు చెప్పి నట్టల్లా ఆడి, ఇక్కడి సంపదను సంస్థానాధీశులు దోచిపెట్టడంతో ఆసేతుహిమాచలం దారిద్య్రం తాండవిస్తున్నది. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే అట్టడుగునున్నాం. ఆహార ధాన్యాల కొరత అంతా ఇంతా కాదు. వీటిని అధిగమించి పురోగమించటం ఎలా అన్న సంశయం అందరినీ పట్టిపీడిస్తున్నవేళ గోరు చుట్టుపై రోకటిపోటులా మతకల్లో లాలు వచ్చిపడ్డాయి. వేలాదిమంది నెత్తుటి తర్పణంతో ఈ గడ్డ తడిసి ముద్దయింది.

హిందూ–ముస్లిం ఐక్యత కోసం స్వాతంత్య్రోద్యమ సారథి గాంధీజీ తన ప్రాణాలనే బలిపెట్టాల్సివచ్చింది. ఆ పరిస్థితుల్ని చూసినవారు ఈ దేశం సమైక్యంగా మనుగడ సాధించగలదా అన్న సందేహంలో పడిపోయారు. భిన్న భాషలు, మతాలు, సంప్ర దాయాలు, సంస్కృతిగల ఈ గడ్డ పురోగతి సాధించటం అసాధ్యమని సంశయపడ్డ వారున్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని, వైవిధ్యతలో విశ్వాసాన్ని దర్శించగలిగిన సామాన్య జనమే ఈ దేశాన్ని నడిసంద్రంనుంచి తీరానికి చేర్చారు. 

మరి ఇప్పుడో... బహుళ రంగాల్లో పురోగమించాం. ఆహార ధాన్యాల దిగుమతి స్థాయినుంచి ఎగుమతి చేసే స్థాయికెదిగాం. ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం కూడా ఒకటి. అతిపెద్ద స్టార్టప్‌ నెట్‌వర్క్‌లో ప్రపంచంలో మనది మూడో స్థానం. జనగణన పూర్తికాకపోవటంతో తాజా పరిస్థితిపై సాధికారకమైన గణాంకాలు లేకున్నా అక్షరాస్యత 77.7–80 శాతం మధ్య ఉందంటు న్నారు. స్వాతంత్య్రానికి పూర్వం మహిళల్లో అక్షరాస్యత దాదాపు 9 శాతమైతే, ఇప్పుడది 70.3 శాతానికి చేరింది. 

గతంతో పోలిస్తే మెరుగైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులోకి రావటంతో సగటు ఆయుఃప్రమాణం 71.5 సంవత్సరాలకు చేరుకుంది. నవజాత శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 1951 నాటికి వెయ్యి శిశువులకూ 146 మరణాలు నమోదుకాగా, ఇప్పుడది 17. ప్రపంచంలోనే అత్యధిక పోలియో కేసులున్న దేశంగా ముద్రపడిన భారత్‌ ఇప్పుడు ఆ వ్యాధిని పూర్తిగా తరమ గలిగింది. ఒకనాడు పేదరికం 60 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతం లోపు. కానీ గణాంకాలు వాటికవే వాస్తవ స్థితిని ప్రతిబింబించలేవు. చివరి వ్యక్తికి సైతం సంక్షేమం అందటమే నిజమైన అభివృద్ధికి కొలమానమని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ఆ విషయంలో సాధించాల్సిందెంతో ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావటంవల్ల ధనిక–పేద తారతమ్యం పెరిగింది. 

పేరుకు డిగ్రీలున్నా మన యువతలో నైపుణ్యాల కొరతవల్ల వారికి సరైన ఉపాధి లభించటం లేదు. అసలు విద్యారంగమే పేద, ధనిక వ్యత్యాసాలతో నిండింది. ప్రామాణికమైన విద్య ఖరీదైంది కావటంతో అత్యధికులు దాన్ని అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రైవేటు మోజులోపడి విద్యావ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో మొదటిసారి నెలకొల్పిన కొఠారి కమిషన్‌(1964–66) మొదలుకొని 2020 నాటి జాతీయ విద్యావిధానం వరకూ విద్యకు జీడీపీలో 6 శాతం కేటాయించాలని సిఫార్సు చేస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ అది 4 శాతానికి మించటంలేదు. 

వైద్యరంగానికీ అంతే. అది ఎప్పుడూ 2.5 శాతం మించదు. మహిళా సాధికారత పెరిగిందనీ, వారు సైతం భిన్న రంగాల్లో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారనీ సంబర పడటమే తప్ప మహిళలపై నేరాలను అరికట్టడంలో, జెండర్‌ వివక్షను నిర్మూలించటంలో ఇంకా వెనకబడే ఉన్నాం. సామాజిక మాధ్యమాల ఆసరాతో మహిళలపై వివక్ష, భావోద్వేగాలు రెచ్చగొట్టడం మరింత పెరిగింది. 

ఏ పార్టీకీ, సిద్ధాంతానికీ చెందని జెన్‌ జీ యువత ఇక్కడంతా సవ్యంగా ఉన్నదన్న భ్రమల్ని బద్దలుకొట్టింది. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ జంతర్‌మంతర్‌ ఉద్యమానికి తక్షణ
సందర్భం కావొచ్చుగానీ... నాసిరకం విద్య, నిరుద్యోగం, అగమ్యగోచర భవిష్యత్తు వారిని నిరాశానిస్పృహల్లోకి నెట్టాయి. కష్టించే స్వభావమూ, కలల్ని సాకారం చేసుకునే పట్టుదల గల యువత కోసం ఇంకేమి చేయాలో గ్రహించగలిగే వివేకం పాలకుల్లో కలిగినప్పుడే దేశం నిజమైన పురోగతి సాధించగలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement