అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలు మెరుగుపడతాయన్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. పైగా అమెరికా విధానాన్ని ఇప్పటికీ తమకు శత్రుత్వపూరితంగానే చూస్తున్నామని ఉత్తర కొరియా చెబుతోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. ఉత్తర కొరియాతో మరోసారి శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు కూడా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కూడా ట్రంప్ తగ్గించారు. అయితే, ఇలాంటి చర్యలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా మాత్రం అమెరికాపై తన వైఖరిని మార్చుకోలేదు. తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించింది.
ఒత్తిడి పెంచే చర్యలే: ఉ.కొరియా
ఉత్తర కొరియా సోమవారం అమెరికాపై తీవ్ర విమర్శలు చేసింది. అమెరికా తమపై కొనసాగిస్తున్న విధానం ఇప్పటికీ శత్రుత్వపూరితంగానే ఉందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర కొరియాను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా మార్చాలన్న అమెరికా డిమాండ్, ఉత్తర కొరియా మానవ హక్కుల పరిస్థితిపై అమెరికా విమర్శలు, అమెరికా–దక్షిణ కొరియా–జపాన్ సైనిక సహకారం తమపై ఒత్తిడి పెంచే చర్యలేనని ఉత్తర కొరియా ఆరోపించింది.
ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే అత్యంత ముఖ్యమైన రక్షణగా అభివర్ణించింది. అమెరికా ఎన్ని డిమాండ్లు చేసినా తమ అణ్వాయుధ స్థితిని మార్చేది లేదని స్పష్టం చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశించడం కూడా ప్రయోజనం లేనిదేనని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ట్రంప్ ఈ నెల అమెరికా–దక్షిణ కొరియా మధ్య జరిగే ఉల్చి ఫ్రీడం షీల్డ్ సైనిక విన్యాసాలను భారీగా తగ్గించారు. ఈ విన్యాసాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, ఉత్తర కొరియాను అనవసరంగా రెచ్చగొట్టేవిగా ఉన్నాయని ట్రంప్ అన్నారు. కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయనతో తాను బాగా కలిసిపోతానని కూడా ట్రంప్ చెప్పారు.
కానీ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మాత్రం.. అమెరికా సైనిక విన్యాసాలను తగ్గించినా అవి ఇప్పటికీ రెచ్చగొట్టే, దూకుడైన చర్యలేనని అన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్నేహపూర్వక చర్యగా భావిస్తే అమెరికాకు తాము ఆశించిన స్పందన లభించదని హెచ్చరించారు.
మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ కలిసి సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ‘ఫ్రీడం ఎడ్జ్’ సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. క్షిపణి, అణు ముప్పులను ఎదుర్కొనేందుకు మూడు దేశాల సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ఉద్దేశం. అయితే ఉత్తర కొరియా మాత్రం ఈ మూడు దేశాల సైనిక సహకారాన్ని తమ ప్రాంతీయ భద్రతకు ముప్పుగా పదేపదే ఖండిస్తోంది. ట్రంప్ కిమ్‌తో సంబంధాలు మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నా, ఉత్తర కొరియా మాత్రం అమెరికాను ఇప్పటికీ శత్రువుగానే చూస్తూ అణ్వాయుధాలను మరింత బలోపేతం చేస్తామని తేల్చిచెప్పింది.


