breaking news
Tatkal ticket
-
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్‌లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్‌కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్‌లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్‌కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్‌లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
ఈ-ఆధార్‌తో తత్కాల్ టికెట్ల బుకింగ్.. అమలు ఎప్పుడంటే..
తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ కోసం భారతీయ రైల్వే తప్పనిసరి ఈ-ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నెలాఖరులో కొత్త విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఈ కోటా కింద నిజమైన ప్రయాణికులకు రైలు టికెట్లను అందించడమే ఈ చర్యల లక్ష్యమని రైల్వేశాఖ తెలిపింది. రైలు టికెట్ బుకింగ్‌లను ఈ-ఆధార్ వెరిఫికేషన్‌తో అనుసంధానం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా టికెటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికల కోసం ఉద్దేశించిన తత్కాల్ టికెట్లను కొందరు ఏజెంట్లు అన్యాయమైన మార్గాలను ఉపయోగించి హోర్డింగ్, ఆటోమేటెడ్ బుకింగ్‌లకు తెరతీస్తున్నారని వాదనలున్నాయి. కొత్త ఈ-ఆధార్ ధృవీకరణ ద్వారా ప్రయాణీకులు బుకింగ్ సమయంలో వారి గుర్తింపును డిజిటల్‌గా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది మోసపూరిత బుకింగ్‌లను అరికట్టడానికి, ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!‘తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వే త్వరలో ఈ-ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తుంది. ఇది నిజమైన వినియోగదారులు అత్యవసర సమయంలో టికెట్లను పొందడానికి సహాయపడుతుంది’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సాధారణంగా ప్రయాణికులు సీట్ల లభ్యతను బట్టి 60 రోజుల ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తర్వాతి రోజు బయలుదేరే రైలు టికెట్ బుకింగ్ కోసం ఏసీ క్లాసులు (1ఎ, 2ఎ, 3ఎ, సిసి, ఇసి, 3ఇ)కు ఈరోజు ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ తరగతుల (ఎస్ఎల్, ఎఫ్‌సీ, 2ఎస్) టికెట్ బుకింగ్ కోసం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. బుకింగ్‌లను అనుమతించే తత్కాల్ పథకం ద్వారా 20% టికెట్లు విక్రయిస్తారు. -
కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ దక్కాలంటే.. 5 సూత్రాలు
రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది.👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండిరైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్లో అంతరాయం కలిగితే టికెట్ బుకింగ్ ఆలస్యమై కన్ఫర్మ్ టికెట్ దక్కే అవకాశం ఉండదు.👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలితత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండిఐఆర్సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.👉 యూపీఐ పేమెంట్తత్కాల్ బుకింగ్ సమయంలో టికెట్ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.👉 రైళ్లను ఎంచుకోవడంబుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి. -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్‌లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్‌వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా...
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు కోవిడ్ విజృంభణ... మరోవైపు ప్రజల్లో మళ్లీ లాక్డౌన్ భయాలు... వెరసి నగరం నుంచి చాలామంది సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని రైళ్లలో వెళ్లిపోయేవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు కానీ తత్కాల్ టికెట్ల ద్వారా బుక్‌చేసుకుని వెళ్లానుకునే ప్రయాణికులకు మాత్రం ‘తత్కాల్ టికెట్ల దందా’చుక్కలు చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)లో తత్కాల్ టికెట్ల దందా అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. గతంలో తత్కాల్ టికెట్‌ను పొందేందుకు రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేసేది. ఈ టోకెన్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్ వద్ద రాత్రంతా జాగారం చేసేవారు. అయితే ఈ టోకెన్ల విధానానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్ స్వస్తి పలికింది. తత్కాల్ టికెట్ జారీ చేసే సమయానికి క్యూలో నిలబడిన వారిని తోసుకుని ఎవరెవరో ముందుకొచ్చేసి టికెట్ తీసేసుకుంటున్నారు. క్యూలో నిలబడిన వారందరికీ టికెట్ మాత్రం లభించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రయాణం చేయాలనుకునేవారు తత్కాల్ టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న దళారులు రెట్టింపు ధరలతో వారి నుంచి వసూలు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధి కారులు తత్కాల్ టికెట్ల జారీపై దళారుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! -
ఈ చిన్న స్టెప్స్ తో తత్కాల్ టికెట్ కన్ఫార్మ్..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దూరపు ప్రయాణాలు చేయలనే అనుకునే వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కువ రైళ్లు అందుబాటులో లేవు. మరీ ముఖ్యంగా పండుగ సెలవుల సమయంలో రైల్వే టికెట్ల కోసం ఎన్నో కష్టాలు పడాల్సివస్తుంది. రైల్వే జనరల్ టిక్కెట్స్ కొన్ని నెలల ముందే బుకింగ్ చేసుకోవడం వల్ల ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్లపైనే ఆశలు పెట్టుకుంటారు. ప్రయాణానికి ఒక రోజు ముందు ఏసీ టికెట్ బుకింగ్ కోసం టైమ్ స్లాట్‌ను ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు. అదే స్లీపర్ క్లాస్ టికెట్ కోసం అయితే ఉదయం 11 గంటలకు టైమ్ స్లాట్ ఉంటుంది. ఈ టికెట్స్ కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ చాలా ఉంటుంది. కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించిన తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ప్రయాణికులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..(చదవండి: కొత్త ఏడాదిలో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్) మాస్టర్ జాబితా: ఇప్పుడు మీరు ఎంత మందికి సంబందించిన టికెట్స్ బుక్ చేయాలనీ అనుకుంటున్నారో వారి వ్యక్తి వివరాలను ముందుగానే మీ ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ విభాగంలో సేవ్ చేయండి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేవలం ఒక్క క్లిక్‌తో మీ పని పూర్తవుతుంది. పేమెంట్ గేట్‌వే: ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వేగంగా చెల్లించవచ్చు. కానీ, ఇప్పుడు మీకు ఈ-వాలెట్, పేటీమ్, యూపీఐ యాప్ లలో ఉన్న స్కాన్ ఆప్షన్ ద్వారా చెల్లింపు చేయడం వల్ల కేవలం కొన్ని సెకన్లలో టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్: టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అన్నింటి కంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండటం చాలా ముఖ్యం. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో వెబ్సైట్ లోడ్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్ నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండటం కారణంగా బుకింగ్ సమయంలో లోపాలు సంభవిస్తాయి. పేమెంట్ కొన్ని సార్లు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో టిక్కెట్లు బుక్ చేయబడవు. సిద్ధంగా ఉండటం: మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు అందులో తర్వాత రాబోయే స్టెప్స్ గురుంచి మీకు పూర్తి అవగాహనా ఉండాలి. ఒకవేల మీకు అవగాహన లేకపోతే మీ టికెట్ బుకింగ్ సమయం ఎక్కువ కావడం వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందు లాగిన్ అవ్వడం: తత్కాల్ టికెట్ బుకింగ్ కోటా తెరవడానికి ఒకటి లేదా రెండు నిమిషాల ముందు లాగిన్ అవ్వడం మంచిది. అలాగే స్టేషన్ కోడ్, బెర్త్ ను ముందే ఎంచుకోండి. బుకింగ్ కోటా తెరిచిన వెంటనే మాస్టర్ జాబితా నుండి ప్రయాణీకుల పేర్లను వెంటనే ఎంచుకుని ఆపై నేరుగా పేమెంట్ ఆప్షన్ కు వెళ్ళండి. బ్యాంక్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం: ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారు అన్ని బ్యాంక్ వివరాలను పేమెంట్ చేయడం కోసం సిద్ధంగా ఉంచాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఓటీపీ, క్యూఆర్ కోడ్ ఆప్షన్ లలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం. ఓటీపీ కోసం రిజిస్టర్డ్ మొబైల్‌ను మీ దగ్గర ఉంచుకోండి. ఒకే బ్రౌజర్లో లాగిన్ అవ్వండి: మీరు టికెట్ తొందరగా బుకింగ్ చేయడం కోసం ఒకే ఐడితో రెండు వేర్వేరు బ్రౌజర్లలో లాగిన్ అవ్వకండి. దీని వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక బ్రౌజర్ పనిచేయకపోతే, మీరు మరొక బ్రౌజర్లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. -
వెలుగులోకి తత్కాల్ మోసం
సాక్షి, న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతోన్న ఓ భారీ రాకెట్టును భారత రైల్వే అధికారులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి సల్మాన్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. నిందితుడు సల్మాన్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను తన నియంత్రణలోకి తీసుకుని నిందితుడు తత్కాల్ టికెట్లను బుక్ చేసే విధానం చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోయారు. సల్మాన్ కేవలం రూ.700 విలువ చేసే సాఫ్ట్ వేర్ సహాయంతో ఐఆర్సీటీసీ సర్వర్‌ను అధీనంలోకి తెచ్చుకుని జిఫ్పీ పద్ధతిలో తత్కాల్ టిక్కెట్లను బుకింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ పనిచేసే విధానం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు ప్రయాణికులందరి వివరాలు కౌంటర్ సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేస్తారు. బుకింగ్ 10 గంటలకు ప్రారంభం కాగానే ట్రైన్ నెంబర్, డేట్‌తో కలిపి మొత్తం ప్రయాణికుల వివరాలన్నీ ఆటోమేటిక్‌గా కౌంటర్ సాఫ్ట్వేర్ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలా రైల్వే స్టేషన్లో కౌంటర్ వద్ద తత్కాల్ కోసం క్యూలో నిలబడిన వారి కంటే ముందుగానే ఈ సాఫ్ట్‌వేర్‌తో టికెట్లు బుక్ చేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సల్మానే సొంతంగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.700 లకు ఒక్కో మధ్యవర్తికి అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్ ద్వారా 2500 కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ప్రీమియం’ దోపిడి
సాక్షి, సిటీబ్యూరో: ఉన్న పథకానికే కొత్త పేరు... ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్నట్టు ప్రకటనలు. అసలుకు ఎసరు. అడ్డదారిలో డబ్బులు పోగేసుకునే వ్యూహం. ఇదీ రైల్వే అధికారుల తీరు. ప్రీమియం రైళ్ల పేరుతో కొత్త తరహా బెర్తుల బేరానికి దిగిన దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లనూ వదిలిపెట్టడం లేదు. వాటిని ‘ప్రీమియం’ రూట్‌కు మళ్లించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బాగా ఉన్న ఏడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’ చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ చార్జీలు ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు భారంగా మారాయి. మిగిలిన రైళ్ల లాగానే తత్కాల్ కోటాలోనే కోత విధించి...‘ప్రీమియం తత్కాల్’ పేరిట దోపిడీకి దిగడం గమనార్హం. జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏడు ప్రధాన రైళ్లలో ప్రవేశపెట్టిన ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దక్షిణ్, గోదావరి, బెంగళూర్, శబరి, పాట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రీమియం తత్కాల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లలోని తత్కాల్ టిక్కెట్లకు కోత పెట్టి 50 శాతం ప్రీమియం తత్కాల్ కిందకు మార్చేశారు. దీంతో ప్రయాణికులు రెట్టింపు మొత్తం చెల్లించవలసి వస్తోంది. మొదట్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్ల (సాధారణ చార్జీలే ఉంటాయి) స్థానంలో ప్రీమియం రైళ్లను (రెట్టింపు చార్జీలు) ప్రవేశపెట్టారు. సెలవులు,పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీని బట్టి ప్రీమియం రైళ్లను నడిపే అధికారులు... ప్రస్తుతం రద్దీతో నిమిత్తం లేకుండా రెగ్యులర్ రైళ్లలో సైతం తత్కాల్ టిక్కెట్లను ప్రీమియంతో ముడిపెట్టడం విశేషం. కోటాకు టాటా... అన్ని రైళ్లలోనూ ఫస్ట్‌క్లాస్, సెకెండ్ ఏసీ, థ ర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలలో 30 శాతం చొప్పున తత్కాల్ టిక్కెట్లు ఉంటాయి. ఒక స్లీపర్ క్లాస్ బోగీలో సాధారణంగా 72 బెర్తులు ఉంటాయి. వాటిలో 22 తత్కాల్కుకేటాయిస్తారు. సాధారణ చార్జీల కంటే తత్కాల్పైరూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ క్లాస్ రూ.475 ఉంటే ... తత్కాల్లో అది రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అలా ప్రతి రైలులోనూ అన్ని తరగతులతో కలిపి సుమారు 300 బెర్తులకు అదనపు చార్జీలతో 24 గంటల ముందుగా బుక్ చేసుకొనే అవకాశం ఉంది. రెండు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’తో... అసలైన తత్కాల్ కోటాకు సగం వరకూ కోత పడింది. అదే సమయంలో చార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రయాణికులపై మరింత భారం పెరిగింది. ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు నాంపల్లి: ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పౌర సంబంధాల నమూనా లేనప్పటికీ భారతదేశంలో పీఆర్ వ్యవస్థ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్లోబల్ అలయన్స్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్ గ్రేగర్ఆఫ్ అన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘గెటింగ్ టు లీడర్ షిప్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, వియత్నాంలోనూ ఉత్తమ పీఆర్ నమూనాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ డాక్టర్ సి.వి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ కె.నరేంద్ర, డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు. -
రైళ్ల సంఖ్య అంతంతే
తెలుగు ప్రయాణికుల ఇక్కట్లు ఇన్నిన్ని కాదయా సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్లే రైళ్ల సంఖ్య అంతంతగానే ఉండడంతో నగరంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీ కారణంగా టికెట్లు లభించలేదని వాపోతున్నారు. గంటలకొద్దీ తత్కాల్ టికెట్ కోసం క్యూ కట్టినా ఫలితం దక్కడం లేదని వారు చెబుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ 2013-2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించినవిధంగానే ముంబై (లోకమాన్య తిలక్ టెర్మినస్) - నిజామాబాద్, ముంబై (లోకమాన్యతిలక్ టెర్మినస్) - కాకినాడ రైళ్లను ప్రారంభించినప్పటికీ ఆశించినమేర ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగిపోయిందని, ఈ కారణంగా టికెట్లు లభించడంలేదని చెబుతున్నారు. నిజామాబాద్, హైదరాబాద్‌ల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలకు కూడా వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడం సాధ్యం కాకపోతే కనీసం కనీసం అదనపు బోగీలైనా అమర్చాలని వారంతా కోరుతున్నారు. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని దాదాపు అన్ని జిల్లాలకు చెందినవారు నివసిస్తున్నారు. వీరిలో కరీంనగర్, నిజామాబాద్, మెదక్ తదితర తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులతోపాటు ప్రైవేటు బస్సులు ఉన్నప్పటికీ రైళ్ల చార్జీల (స్లీపర్, జనరల్ క్లాస్)తో పోలిస్తే ఈ బస్సులకు దాదాపు రెండు నుంచి నాలుగింతలమేర అధికంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. దీంతో అనేక మంది రైలు ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. ముంబై, ఠాణే, భివండీ, కల్యాణ్ తదితర చుట్టుపక్కల నివసించే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు అదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట, మంచిర్యాల తదితర ప్రాంతాల తెలుగు ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లడానికి ముంబై నుంచి ప్రతిరోజూ నడిచే దేవగరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. మరోవైపు కొత్తగా లోకమాన్యతిలక్ (కుర్లా)-నిజామాబాద్‌ల మధ్య రైలును ప్రారంభించినప్పటికీ ఇది వారానికి ఒకసారే నడుస్తోంది. దీంతో అనేకమంది దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కే మొగ్గుచూపుతున్నారు. దీంతో వేసవి సెలవుల సమయంలో ఇదికూడా బాగా రద్దీగా ఉంటోంది. అత్యధిక శాతం మంది ప్రజలు దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుపైనే ఆధారపడుతున్నారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లభించని సందర్భంలో మరో రైలు టికెట్‌కోసం యత్నిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. దేవగరి రైలులో నిజామాబాద్‌కు ప్రత్యేక కోటా లేకపోయినప్పటికీ నాందేడ్ ప్రజలకు మాత్రం ఈ రైలులో ప్రత్యేక కోటాను కల్పించారు. దీంతో ఏ కాలంలోనూ ఈ రైలు టికెట్లు దొరకడం లేదు. ఒకవేళ తత్కాల్ టికెట్ల కోసం యత్నించినా అది క్షణాల్లో వెయిటింగ్ జాబితాకి చేరుకుంటోంది. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన రైలులోకూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో మరో కొత్త రైలు కేటాయించపోయినప్పటికీ కనీసం దేవగరి రైలుకు మరిన్ని బోగీలను అమర్చడంతోపాటు లోకమాన్యతిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలును ప్రతి రోజూ నడపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ముంబై నుంచి ఈమార్గంలో వెళ్లే ఏదైనా ఓ రైలును నిజామాబాద్ వరకు పొడగించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి వాటిలో ప్రస్తుతం సికింద్రాబాద్-మన్మాడ్‌ల మధ్య నడుస్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్, ముంబై-నాందేడ్ల మధ్య నడుస్తున్న తపోవన్ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. అదేవిధంగా వీలైతే నిజామాబాద్ మీదుగా మన్మాడ్, నాగర్సోల్ వరకు నడుస్తున్న రైళ్లను ముంబైదాకా పొడగించాలని కూడా తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఠాణేలో ఆపాలి నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కొద్దిసేపు ఠాణేలో ఆపాలని తెలుగు ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తెలంగాణ ప్రాంత ప్రజలతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు కూడా నివసిస్తున్నారు. వీరంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన లోకమాన్యతిలక్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. అదేవిధంగా వారానికి ఒకసారి నడిచే భావ్‌నగర్-కాకినాడ రైలు కూడా కల్యాణ్ మీదుగానే వెళుతుంది. ఇక ఎల్టీటీ-కాకినాడ రైలును వారానికి రెండుసార్లు నడుపుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంతాల ప్రజలకు కోసం కొత్తగా ప్రారంభించిన లోకమాన్య తిలక్ టెర్మినస్-నిజామాబాద్ రైలుతోపాటు పైనపేర్కొన్న రెళ్లలో ప్రయాణించేందుకు ఠాణే చుట్టుపక్కల నివసించే ప్రజలకు లోకమాన్యతిలక్ టెర్మినస్ లేదా, కల్యాణ్ వరకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రైళ్లను ఠాణేలో నిలపకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుగు ప్రయాణికులు వాపోతున్నారు.