
రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది.
👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి
రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్‌లో అంతరాయం కలిగితే టికెట్ బుకింగ్ ఆలస్యమై కన్ఫర్మ్ టికెట్ దక్కే అవకాశం ఉండదు.
👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలి
తత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.
👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండి
ఐఆర్‌సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.
👉 యూపీఐ పేమెంట్
తత్కాల్ బుకింగ్ సమయంలో టికెట్ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.
👉 రైళ్లను ఎంచుకోవడం
బుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి.