వెలుగులోకి తత్కాల్‌ మోసం

Indian Railways Busts Major Tatkal Booking Racket - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతోన్న ఓ భారీ రాకెట్టును భారత రైల్వే అధికారులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి సల్మాన్‌ అనే కీలక నిందితుడిని అరెస్ట్‌ చేసింది. నిందితుడు సల్మాన్‌ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను తన నియంత్రణలోకి తీసుకుని నిందితుడు తత్కాల్‌ టికెట్లను బుక్‌ చేసే విధానం చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోయారు. సల్మాన్‌ కేవలం రూ.700 విలువ చేసే సాఫ్ట్‌ వేర్‌ సహాయంతో ఐఆర్‌సీటీసీ సర్వర్‌ను అధీనంలోకి తెచ్చుకుని జిఫ్పీ పద్ధతిలో తత్కాల్‌ టిక్కెట్లను బుకింగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

సాఫ్ట్‌వేర్‌ పనిచేసే విధానం
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసే ముందు ప్రయాణికులందరి వివరాలు కౌంటర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్‌ చేస్తారు. బుకింగ్‌ 10 గంటలకు ప్రారంభం కాగానే ట్రైన్‌ నెంబర్‌, డేట్‌తో కలిపి మొత్తం ప్రయాణికుల వివరాలన్నీ ఆటోమేటిక్‌గా కౌంటర్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. ఇలా రైల్వే స్టేషన్‌లో కౌంటర్‌ వద్ద తత్కాల్‌ కోసం క్యూలో నిలబడిన వారి కంటే ముందుగానే ఈ సాఫ్ట్‌వేర్‌తో టికెట్లు బుక్‌ చేస్తారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను సల్మానే సొంతంగా డిజైన్‌ చేసినట్లు తెలిసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.700 లకు ఒక్కో మధ్యవర్తికి అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌ ద్వారా 2500 కంప్యూటర్లలో డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top