జింబాబ్వే 141 ఆలౌట్‌.. బంగ్లా బౌల‌ర్ అరుదైన రికార్డు | Nahid Rana Scripts History Vs Zimbabwe-ODI-Become-3rd-Bangla-Bowler | Sakshi
Sakshi News home page

జింబాబ్వే 141 ఆలౌట్‌.. బంగ్లా బౌల‌ర్ అరుదైన రికార్డు

Jul 6 2026 5:10 PM | Updated on Jul 6 2026 5:53 PM

Nahid Rana Scripts History Vs Zimbabwe-ODI-Become-3rd-Bangla-Bowler

జింబాబ్వేతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ బౌల‌ర్ న‌హీద్ రానా చ‌రిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వ‌న్డేలో న‌హీద్ రానా కెరీర్ బెస్ట్ బౌలింగ్ (10-2-21-6) ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆరు వికెట్ల‌తో జింబాబ్వే ప‌త‌నాన్ని శాసించిన న‌హీద్ రానా ఐదు వికెట్ల ప్రదర్శనతో అరుదైన రికార్డు అందుకున్నాడు. 

రైట్ ఆర్మ్ పేస‌ర్ అయిన నహీద్ రానా 14  వ‌న్డే మ్యాచ్‌ల్లోనే మూడుసార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్ త‌ర‌ఫున వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన మూడో బౌల‌ర్‌గా న‌హీద్ రానా నిలిచాడు. ఈ జాబితాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 6 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న (124 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉండ‌గా, అబ్దుల్ ర‌జాక్ నాలుగు సార్లు (153 మ్యాచ్‌లు), ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ నాలుగు సార్లు (247 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. 

న‌హీద్ రానా మూడో స్థానంలో ఉండ‌గా, త‌స్కిన్ అహ్మ‌ద్ రెండు సార్లు (92 మ్యాచ్‌లు) ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసి త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. 2024లో బంగ్లాదేశ్ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన న‌హీద్ రానా అన‌తి కాలంలోనే స్టార్ బౌల‌ర్‌గా ఎదిగాడు. 14 వ‌న్డేల్లో 30 వికెట్లు ప‌డ‌గొడితే, అందులో ఈ ఏడాదిలోనే 25 వికెట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. 

తొలుత పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన న‌హీద్ రానా, ఆ త‌ర్వాత ఆస్ట్రేలియాపై, తాజాగా జింబాబ్వేపై ఐదు వికెట్ల ఫీట్‌తో మెరిశాడు. మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 36.4 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కు ఆలౌటైంది. న్యూమ‌న్ నైమూరి (33) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, కెప్టెన్‌ రిచ‌ర్డ్ న‌గ‌ర‌వా (27), ఇన్నోసెంట్ కైయా (26) ప‌ర్వాలేద‌నిపించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో న‌హీద్ రానా 6 వికెట్లు తీయ‌గా, త‌స్కిన్ అహ్మ‌ద్ 2 వికెట్లు తీశాడు. 

142 ప‌రుగుల‌ స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ కూడా బ్యాటింగ్‌లో త‌డ‌బ‌డుతోంది. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్లు కోల్పోయి 19 ప‌రుగులు చేసి క‌ష్టాల్లో ప‌డింది. బ్లెసింగ్ ముజ‌ర‌బానీ 2 వికెట్లు తీయ‌గా, న‌గ‌ర‌వా ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement