breaking news
Ben Curran
-
రాణించిన కర్రన్, సికందర్ రజా.. శ్రీలంకకు కఠిన సవాల్ విసిరిన జింబాబ్వే
హరారే వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే శ్రీలంక జట్టుకు కఠిన సవాల్‌ను విసిరింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేసింది. టాస్ ఓడినా శ్రీలంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. ఓపెనర్ బెన్ కర్రన్ (95 బంతుల్లో 79; 9 ఫోర్లు), సికందర్ రజా (55 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కర్రన్, సికిందర్ రజాతో పాటు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. వికెట్‌కీపర్ క్లైవ్ మదండే 36, బ్రియాన్ బెన్నెట్ 21, బ్రెండన్ టేలర్, కెప్టెన్ సీన్ విలియమ్స్ తలో 20, మున్యోంగా 10, బ్రాడ్ ఈవాన్స్ 8, నగరవ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లు ఏకంగా 19 వైడ్లు వేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు తీయగా.. అషిత ఫెర్నాండో 2, దిల్షన్ మధుష్క, జనిత్ లియనాగే చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఒ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఈవాన్స్ ఆదిలో ఇబ్బంది పెట్టాడు. జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద నువనిదు ఫెర్నాండోను (14), 68 పరుగుల వద్ద కుసాల్ మెండిస్‌ను (5) ఈవాన్స్ ఔట్ చేశాడు. 20 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయాక శ్రీలంక జట్టు జాగ్రత్తగా ఆడుతుంది. పథుమ్ నిస్సంక, సదీర సమరవిక్రమ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయమైన 55 పరుగులు జోడించారు. 26 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 126/2గా ఉంది. నిస్సంక 77, సమరవిక్రమ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి.కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను ఓడించినంత పని చేసింది. శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. లేకపోయుంటే జింబాబ్వే సంచలన విజయం సాధించేది. జింబాబ్వే ఆటగాళ్ల పట్టుదల చూస్తుంటే రెండో మ్యాచ్‌లోనూ హోరాహోరీ తప్పేలా లేదు. పోరాడేందుకు వారు మంచి స్కోరే చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి శ్రీలంకకు అనుకూలంగా ఉన్నా, మ్యాచ్ సాగేకొద్ది ఏమైనా జరగవచ్చు. -
శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లొర్కన్ టక్కర్ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గరవ, ట్రెవర్ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ప్రారంభించిన బెన్ కరన్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (59 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ ఎక్స్ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్ ఏ బాయ్!.. అద్బుత ఇన్నింగ్స్’’ అని ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కరన్‌కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్ కరన్ పెద్దవాడు కాగా.. బెన్ కరన్ రెండోవాడు. ఇక సామ్ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్, సామ్ మాత్రం ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్కే దక్కింది. 28 ఏళ్ల బెన్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. 26 ఏళ్ల సామ్ కరన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్పేస్ మీడియం బౌలర్ అయిన అతడు లెఫ్టాండర్ బ్యాటర్. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్ కరన్ కూడా బౌలింగ్ ఆల్‌రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది.చదవండి: సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్