
స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే (Zimbabwe) ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తుగా ఓడించింది. 12 ఏళ్ల తర్వాత జింబాబ్వే గెలిచిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది.
మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అన్ని విభాగాల్లో సత్తా చాటింది. బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్ కనీసం 200 స్కోర్ కూడా చేయనివ్వలేదు. బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటారు. ఓపెనర్ బెన్ కర్రన్ (Ben Curran) కెరీర్‌లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. సికందర్ రజా అర్ద సెంచరీతో రాణించాడు. నిక్ వెల్చ్ 49 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిచర్డ్ నగరవ 5 వికెట్లతో చెలరేగాడు. ముజరబానీ ఈ ఇన్నింగ్స్‌లోనూ రాణించి 3 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు (Afghanistan) ఒకే ఒక సానుకూల అంశం ఉంది. పేసర్ జియా ఉర్ రెహ్మాన్ 7 వికెట్లతో చెలరేగాడు. ఆఫ్ఘన్ స్టార్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (37, 9) ఇబ్రహీం జద్రాన్ (19, 42) పెద్దగా రాణించలేకపోయారు.
అయినా తొలి ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, రెండో ఇన్నింగ్స్‌లో జద్రానే టాప్ స్కోరర్లు కావడం విశేషం. కెప్టెన్ హష్మతుల్లా షాహీది (7, 7) రెండు ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో బషీర్ షా (32) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.
మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై, ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోర్ వివరాలు..
జింబాబ్వే-359
ఆఫ్ఘనిస్తాన్-127 & 159
కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.
చదవండి: బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్