శతక్కొట్టిన కర్రన్‌.. ఫ్యామిలీలో మొదటి వ్యక్తి..! | Ben Curran, Sam Curran's brother, slams maiden Test century, achieves unique distinction for family | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన కర్రన్‌.. ఫ్యామిలీలో మొదటి వ్యక్తి..!

Oct 21 2025 6:47 PM | Updated on Oct 21 2025 6:52 PM

Ben Curran, Sam Curran's brother, slams maiden Test century, achieves unique distinction for family

స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే ఆటగాడు బెన్‌ కర్రన్‌ (Ben Curran) సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సామ్‌ కర్రన్‌, టామ్‌ కర్రన్‌లకు సోదరుడైన బెన్‌ కర్రన్‌ జింబాబ్వే తరఫున టెస్ట్‌ల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 

అంతకుముందు జింబాబ్వే తరఫున వన్డేల్లో కూడా సెంచరీ చేసిన బెన్‌.. కర్రన్‌ ఫ్యామిలీలో రెండు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకెక్కాడు.

కర్రన్‌ కుటుంబంలో మొత్తం నలుగురు క్రికెటర్లు ఉన్నారు. సామ్‌, టామ్‌, బెన్‌ కర్రన్ల తండ్రి కెవిన్‌ కర్రన్‌ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడాడు. ఇందులో 9 వికెట్లు తీసి, 2 అర్ద సెంచరీల సాయంతో 287 పరుగులు చేశాడు.

బెన్‌ సోదరుడు సామ్‌ కర్రన్‌ ఇంగ్లండ్‌ తరఫున 24 టెస్ట్‌లు, 35 వన్డేలు, 63 టీ20లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మరో కర్రన్‌ టామ్‌ కూడా ఇంగ్లండ్‌ తరఫున 2 టెస్ట్‌లు, 28 వన్డేలు, 30 టీ20లు ఆడినా ఒక్క మూడంకెల స్కోర్‌ కూడా చేయలేదు. తండ్రి కెవిన్‌, సామ్‌ కర్రన్లు ఆల్‌రౌండర్లు కాగా.. టామ్‌ స్పెషలిస్ట్‌ బౌలర్‌. వీరికి టాపార్డర్‌లో బ్యాటింగ్‌ అవకాశాలు పెద్దగా రాలేదు.

అయితే బెన్‌ అలా కాదు. అతను జింబాబ్వే తరఫున స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా, ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. అందుకే అతనికి వన్డేల్లో, టెస్ట్‌ల్లో సెంచరీ చేసే అవకాశం దక్కింది. తండ్రి జన్మస్థలం కావడంతో బెన్‌ జింబాబ్వే పౌరసత్వం పొంది, ఆ దేశానికి ఆడుతున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. బెన్‌ సెంచరీతో (121) చెలరేగడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. రెండో రోజు టీ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (6), నిక్‌ వెల్చ్‌ (49), బ్రెండన్‌ టేలర్‌ (32), కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ (5), సికందర్‌ రజా (65) ఔట్‌ కాగా.. ట్సిగా (11), బ్రాడ్‌ ఈవాన్స్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో జియా ఉర్‌ రెహ్మాన్‌ 3, ఇస్మత్‌ ఆలం​ 2, షరాఫుద్దీన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం​ జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై 175 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌటైంది. యువ పేసర్‌ బ్రాడ్‌ ఈవాన్స్‌ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్‌కు బ్లెస్సింగ్‌ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

కాగా, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం​ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్‌ మ్యాచ్‌ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్‌ 29, 21, నవంబర్‌ 2) జరుగనున్నాయి. 

చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్‌ డకౌట్‌.. తడబడిన సౌతాఫ్రికా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement