
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 148 పరుగులు వెనుకపడి ఉంది.
కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (32), ర్యాన్ రికెల్టన్ (14), టోనీ డి జోర్జి (55), డెవాల్డ్ బ్రెవిస్ (0) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (68), కైల్ వెర్రిన్ (10) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించారు. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.
తడబడిన సౌతాఫ్రికా
పాక్‌ను ఓ మోస్తరు స్కోర్‌కు పరిమితం చేశాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే మార్క్రమ్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో స్టబ్స్, జోర్జి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.
అయితే ఆట చివరి అర్ద గంటలో సౌతాఫ్రికా తడబడబాటుకు లోపైంది. ఆసిఫ్ అఫ్రిది చెలరేడంతో నాలుగు పరుగుల వ్యవధిలో సెట్ బ్యాటర్ జోర్జి, అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ వికెట్లు కోల్పోయింది. స్టబ్స్, వెర్రిన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు.
కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.
చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్‌గా ఇంకో అఫ్రిది