
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 (ICC ODI WC 2027) కోసం టీమిండియా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే కెప్టెన్‌ను మార్చినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించాడు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌క్ సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సెలక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే.
సెలక్షన్ నా చేతుల్లో లేదు
జడ్డూకు మొండిచేయి చూపి స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయంపై జడ్డూ స్పందిస్తూ.. ‘‘సెలక్షన్ నా చేతుల్లో లేదు. అయితే, ఈ టూర్‌లో ఆడాలని ఆశపడిన మాట వాస్తవమే.
కానీ జట్టు యాజమాన్యం, సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. నన్ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అయితే, జట్టు ప్రకటనకు ముందే నాతో ఈ విషయం గురించి చర్చించడం సంతోషం కలిగించింది.
అందుకే జట్టులో నా పేరు లేనపుడు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నన్ను ఎందుకు తప్పించారో చెప్పినందుకు కాస్త ఊరటగా అనిపించింది’’ అని జడేజా కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలు వన్డే వరల్డ్‌కప్ ఆడే విషయంపై హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తద్వారా దిగ్గజ బ్యాటర్లను మెగా టోర్నీ దాకా కొనసాగించే పరిస్థితి లేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జడ్డూకు కూడా రో-కో మాదిరి తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి జడ్డూ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టులో అతడు తప్పక ఉండాలి
ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు 2027 వరల్డ్‌కప్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో దయచేసి రవీంద్ర జడేజా పేరు విస్మరించకండి. అతడు కూడా ప్రణాళికల్లో ఉంటాడు. ఇందులో సందేహానికి తావులేదు.
ఇప్పటికీ ఏడు- ఎనిమిదేళ్ల క్రితం మాదిరే అతడు ఫీల్డింగ్ చేస్తున్నాడు. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బంతి కోసం అతడు పాదరసంలా పరుగులు తీస్తుంటే చూడటం ముచ్చటగా అనిపిస్తుంది.
ఆస్ట్రేలియాతో వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నేను అర్థం చేసుకోగలను. అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి వేదికైన సౌతాఫ్రికాలో పిచ్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్షర్ పటేల్‌తో పాటు రవీంద్ర జడేజా తప్పక జట్టులో ఉండాలి’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి వన్డేలో గిల్ సేన ఆసీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్