
లాహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఓ టెస్ట్ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముత్తుసామికి ముందు హగ్ టేఫీల్డ్ (1952లో ఆస్ట్రేలియాపై 13/165), హగ్ టేఫీల్డ్ (1957లో ఇంగ్లండ్‌పై 13/192), కేశవ్ మహారాజ్ (2018లో శ్రీలంకపై 12/283), పాల్ ఆడమ్స్ (2003లో బంగ్లాదేశ్‌పై 10/106) మాత్రమే ఈ ఘనత సాధించారు.
ముత్తుసామి ప్రదర్శనల కారణంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిలబడగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 378 పరుగులకు పరిమితం చేసిన ముత్తు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగి ప్రత్యర్దిని 167 పరుగులకే మట్టుబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముత్తుసామితో పాటు సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు.
పాక్ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు ఆధిక్యం సాధించిన పాక్.. రెండో ఇన్నింగ్స్ స్కోర్ కలుపుకుని సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలోనే తడబడింది. 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 3, వియాన్ ముల్దర్ డకౌటయ్యారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది.
ర్యాన్ రికెల్టన్ (29), టోనీ డి జోర్జీ (16) ఆచితూచి ఆడుతూ నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులుగా ఉంది. గెలుపుకు 226 పరుగుల దూరంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన నౌమన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపుతున్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు నౌమన్ ఖాతాలోనే పడ్డాయి.
శతక్కొట్టిన జోర్జి
అంతకుముందు టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు.
ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.
చదవండి: రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం