
టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్‌గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.
సారథిగా తొలి ప్రయత్నంలోనే
కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేశాడు.
విండీస్‌ను వైట్‌వాష్ చేసి తొలి విజయం
ఇక తాజాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసి.. కెప్టెన్‌గా గిల్ తొలి సిరీస్ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన భారత క్రికెట్ యాజమాన్యం.. గిల్‌కు పగ్గాలు అప్పగించింది.
ఫేవటెరిజం లేదు
ఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్‌పై విజయానంతరం గంభీర్ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్ అర్హుడు.
ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు కెప్టెన్ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.
అందరూ అతడిని గౌరవిస్తారు
ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్‌లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్‌తో నేను చాలాసార్లు చెప్పాను.
రెండున్నర నెలల పాటు అక్కడ గిల్ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్‌రూమ్‌లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
నాకు ఆ అవసరం ఉంది
ఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్ కోసం మెంటల్ కండిషనింగ్ కోచ్‌ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్