
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 14) శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు (Sri Lanka vs New Zealand) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
నిలాక్షి డిసిల్వ (55 నాటౌట్), కెప్టెన్ చమారీ ఆటపట్టు (53), హసిని పెరీరా (44), విష్మి గౌతమ్ (42) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మిగతా లంక బ్యాటర్లలో హర్షిత 26, కవిష దిల్హరి 4, పియుమి వత్సల బడల్జే 7 పరుగులకు ఔటయ్యారు. అనుష్క సంజీవని 6 పరుగులతో అజేయంగా నిలిచింది.
లంక స్కోర్కు ఎక్స్ట్రాల రూపంలో అదనంగా 21 పరుగులు యాడ్ అయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రీ ఇల్లింగ్ 2, రోస్మేరి మైర్ ఓ వికెట్ పడగొట్టారు.
కాగా, భారత్తో కలిసి ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక ఈ టోర్నీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరింది.
టోర్నీ ఆరంభ మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు 3 మ్యాచ్ల్లో 2 పరాజయాలతో కేవలం ఒకే ఒక పాయింట్ ఖాతాలో కలిగి ఉండి పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శన కూడా ఇప్పటివరకు ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు 3 మ్యాచ్ల్లో రెండు పరాజయాలు, ఓ విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్.. మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది.
ఇతర జట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ చిట్టచివరి స్థానంలో ఉంది.
చదవండి: పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన ఘనత