
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో వివాదంలో చిక్కుకుంది. HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. ఈ విషయంపై అసోసియేషన్‌తో పలువురు క్రికెటర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు అందింది.
అండర్- 16, అండర్- 19, అండర్-23 లీగ్ మ్యాచ్‌లలో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం తాజాగా బయటపడినట్లు సమాచారం. వయసు ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు కూడా నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయంలో గతంలో ఆరుగురు ప్లేయర్లను గుర్తించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వారిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఎక్కువ వయసున్న ఆటగాళ్లలో తక్కువ వయసున్న విభాగంలో ఆడేందుకు HCA అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. దీని వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్లకు నష్టం వాటిల్లుతుందన్న సంగతి తెలిసినా HCA తమ తీరు మార్చుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. అవినీతికి పాల్పడుతూ టాలెంట్ లేని ప్లేయర్లను ఆడిస్తున్న HCA అధికారులపై చర్యలు తీసుకోవాలని అనంతరెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గత కొన్నాళ్లుగా HCA వివిధ అంశాల్లో అవినీతికి పాల్పడిన తీరు.. అసోసియేషన్‌పై విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.