
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు (Pakistan) ఇవాళే (అక్టోబర్ 21) మరో అఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తొలుత వన్డే జట్టుకు షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Afridi) కెప్టెన్‌గా ఎంపిక చేసిన పాక్ సెలెక్టర్లు.. తాజాగా సూపర్-6 ఫార్మాట్ కెప్టెన్‌గా అబ్బాస్ అఫ్రిదిని (Abbas Afridi) నియమించారు.
హాంగ్‌కాంగ్ సిక్సస్ టోర్నీలో (Hong Kong Sixes 2025) పాల్గొనబోయే పాక్ జట్టుకు అబ్బాస్ అఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అబ్బాస్ అఫ్రిది పాక్ మాజీ పేసర్ ఉమర్ గుల్‌కు మేనల్లుడు. అబ్బాస్‌ను ఇటీవలే పాక్ జట్టు నుంచి తప్పించారు. ఆసియా కప్ జట్టులో చోటు ఆశించిన అబ్బాస్‌కు నిరాశ ఎదురైంది.
తాజాగా పాక్ సెలెక్టర్లు అబ్బాస్‌కు న్యాయం చేశారు. సూపర్ సిక్సస్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండటం అబ్బాస్‌కు ఇదే తొలిసారి.
ఈ పాక్ జట్టులో అబ్బాస్‌తో పాటు అబ్దుల్ సమద్, మోహమ్మద్ షెహజాద్, ఖవాజా నఫాయ్, మాజ్ సదాఖత్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్‌కు చోటు దక్కింది. డానిశ్ అజీజ్, మొహమ్మద్ ఫైక్ రిజర్వ్‌లుగా ఎంపికయ్యారు.
హాంగ్‌కాంగ్ సూపర్ సిక్సస్ టోర్నీ నవంబర్ 7 నుంచి 9 వరకు హాంగ్‌కాంగ్‌లోని Tin Kwong Road Recreation Ground వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇన్నింగ్స్‌కు ఆరు ఓవర్లు ఉంటాయి.
ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో పాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కువైట్, హాంగ్‌కాంగ్, సౌతాఫ్రికా దేశాల జట్లు పాల్గొంటున్నాయి.
భారత్ తరఫున ఇటీవలే ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నాడు. టీమిండియాకు దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
కాగా, హాంగ్‌కాంగ్ సిక్సస్ అనే టోర్నీ 1992లో పరిచయమైంది. తొలి ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది. ఆతర్వాత వరుసగా ఐదేళ్లు నిరంతరాయంగా సాగిన ఈ టోర్నీకి బ్రేక్ పడింది. 2001లో పునఃప్రారంభమైంది.
అప్పటి నుంచి 2012 వరకు నిరాటంకంగా సాగింది. మధ్యలో 2017లో జరిగింది. తిరిగి 2024లో పునఃప్రారంభమైంది. గత ఎడిషన్ ఫైనల్లో శ్రీలంక పాక్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ 2005లో ఛాంపియన్‌గా నిలిచింది.
చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి