
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో రిటైరవుతుంటారు. అలాంటిది ఈ మధ్య వయసులో అరంగేట్రం చేయడమంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఓ పాక్ ఆటగాడు 38 ఏళ్ల 299 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఇది చూసి అభిమానులు రిటైరయ్యే వయసులో అరంగేట్రం ఏంటని అనుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది (Asif Afridi) వయసు 38 ఏళ్ల 299 రోజులు. ఈ లేటు వయసులో అతను పాక్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు.
రావల్పిండిలో సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో (Pakistan Vs South Africa) ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేశాడు. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) నుంచి ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం క్యాప్ అందుకోవడం విశేషం.
ఈ వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ద్వారా ఆసిఫ్ అఫ్రిది ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున రెండో అతి పెద్ద వయస్కుడైన టెస్ట్ అరంగేట్రీగా రికార్డుల్లోకెక్కాడు. పాక్ తరఫున అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు మిరాన్ బక్ష్ (Miran Bakhsh) పేరిట ఉంది. 1955లో ఇతను 47 ఏళ్ల 284 రోజుల వయసులో భారత్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు.
ఓవరాల్‌గా చూస్తే.. ప్రపంచంలో అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జే సౌథర్టన్ పేరిట ఉంది. ఇతను టెస్ట్ క్రికెట్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 49 ఏళ్ల 119 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. అత్యంత లేటు వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆసిఫ్ అఫ్రిదిది 24వ స్థానం.
ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేసిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 81 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 236 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16), కెప్టెన్ షాన్ మసూద్ (87) ఔట్ కాగా..సౌద్ షకీల్ (36), మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి.
చదవండి: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్‌లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..!