రాణించిన కర్రన్‌, సికందర్‌ రజా.. శ్రీలంకకు కఠిన సవాల్‌ విసిరిన జింబాబ్వే | Ben Curran, Sikandar Raza Shines With Fifties, Zimbabwe Scored 277 Runs Vs Sri Lanka In 2nd ODI | Sakshi
Sakshi News home page

రాణించిన కర్రన్‌, సికందర్‌ రజా.. శ్రీలంకకు కఠిన సవాల్‌ విసిరిన జింబాబ్వే

Aug 31 2025 7:24 PM | Updated on Aug 31 2025 7:24 PM

Ben Curran, Sikandar Raza Shines With Fifties, Zimbabwe Scored 277 Runs Vs Sri Lanka In 2nd ODI

హరారే వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే శ్రీలంక జట్టుకు కఠిన సవాల్‌ను విసిరింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఆగస్ట్‌ 31) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో జింబాబ్వే తొలుత బ్యాటింగ్‌ చేసి మంచి స్కోర్‌ చేసింది. 

టాస్‌ ఓడినా శ్రీలంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. ఓపెనర్‌ బెన్‌ కర్రన్‌ (95 బంతుల్లో 79; 9 ఫోర్లు), సికందర్‌ రజా (55 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కర్రన్‌, సికిందర్‌ రజాతో పాటు మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. వికెట్‌కీపర్‌ క్లైవ్‌ మదండే 36, బ్రియాన్‌ బెన్నెట్‌ 21, బ్రెండన్‌ టేలర్‌, కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ తలో 20, మున్యోంగా 10, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8, నగరవ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

ఈ ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లు ఏకంగా 19 వైడ్లు వేశారు. లంక బౌలర్లలో దుష్మంత చమీరా 3 వికెట్లు తీయగా.. అషిత ఫెర్నాండో 2, దిల్షన్‌ మధుష్క, జనిత్‌ లియనాగే చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఒ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను జింబాబ్వే పేసర్‌ బ్రాడ్‌ ఈవాన్స్‌ ఆదిలో ఇబ్బంది పెట్టాడు. జట్టు స్కోర్‌ 48 పరుగుల వద్ద నువనిదు ఫెర్నాండోను (14), 68 పరుగుల వద్ద కుసాల్‌ మెండిస్‌ను (5) ఈవాన్స్‌ ఔట్‌ చేశాడు. 20 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయాక శ్రీలంక జట్టు జాగ్రత్తగా ఆడుతుంది. 

పథుమ్‌ నిస్సంక, సదీర సమరవిక్రమ మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయమైన 55 పరుగులు జోడించారు. 26 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్‌ 126/2గా ఉంది. నిస్సంక 77, సమరవిక్రమ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి.

కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను ఓడించినంత పని చేసింది. శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్‌ ముందు వరకు పోరాడిన సికందర రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్‌ కావడంతో పరిస్థితి తారుమారైంది. 

లంక బౌలర్‌ మధుష్క చివరి ఓవర్‌ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. లేకపోయుంటే జింబాబ్వే సంచలన విజయం సాధించేది. జింబాబ్వే ఆటగాళ్ల పట్టుదల చూస్తుంటే రెండో మ్యాచ్‌లోనూ హోరాహోరీ తప్పేలా లేదు. పోరాడేందుకు వారు మంచి స్కోరే చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి శ్రీలంకకు అనుకూలంగా ఉన్నా, మ్యాచ్‌ సాగేకొద్ది ఏమైనా జరగవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement