విక్రమ్–1 రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం
షార్ నుంచి తొలి ఉపగ్రహ ప్రైవేట్ రాకెట్ ఇదే
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయంగా కొత్త శకానికి నాంది పలుకుతోంది. తొలిసారి ప్రైవేట్‌గా అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఇస్రోలోని ఇన్–స్పేస్ సంస్థ ద్వారా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే విక్రమ్–1 ఉపగ్రహ రాకెట్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రాకెట్ నాలుగు దశల అనుసంధానాన్ని పూర్తి చేసింది.
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. తొలుత 2022 నవంబర్ 18న ఈ రాకెట్‌ను విక్రమ్–ఎస్ పేరుతో వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విక్రమ్–1 పేరుతో ఉపగ్రహ రాకెట్‌ను ఈ నెల 12 నుంచి ఆగస్టు 4లోపు ఎప్పుడైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయోగానికి షార్ అధికారులు సహకరిస్తున్నారు. ఇస్రో ప్రయోగించే తొలి ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ ఇదే కావడం గమనార్హం. ఇది విజయవంతమైతే సరికొత్త అధ్యాయానికి అడుగులు పడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
నాలుగు దశల రాకెట్ ఇలా..
విక్రమ్–1 రాకెట్‌ను నాలుగు దశలతో రూపొందించారు. మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ ద్రవ ఇంధనంతో తయారు చేశారు. మొదటి దశకు కలాం–1200, రెండోదశకు కలాం–250, మూడో దశకు కలాం–100, నాలుగో దశకు రామన్ మోటార్స్ అని నామకరణం చేశారు. నాలుగోదశలో మోనో మీౖథెల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్) నైట్రోజన్ టెట్రాక్సైడ్ (ఎన్‌టీఓ) శక్తితో పనిచేసే నాలుగు రామన్–1 ఇంజిన్ల సమూహంతో పని చేస్తుంది. ఇది మొత్తంగా 3.4 కేఎన్ థ్రస్ట్‌ను అందిస్తుంది. వీటిలో ప్రతి దశ 80 సెకెండ్ల నుంచి 100 సెకెండ్ల వరకు మండుతుంది.
రామన్ ఇంజిన్లను కచ్చితమైన కక్ష్య ప్రవేశానికి, తుది కక్ష్య సర్దుబాట్ల కోసం రూపొందిస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ›ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లుతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోలు బరువు కలిగిన చిన్న తరహా ఉపగ్రహాలను 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే విధంగానే 290 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య సమకాలీన ధ్రువ కక్ష్య (ఎస్‌ఎస్‌పీఓ)లోకి సునాయాసంగా ప్రవేశపెట్టగలిగిన సామర్థ్యం కూడా కలిగి ఉంది.
అలాగే 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను 45 డిగ్రీల వంపుతో 500 కిలోమీటర్లు ఎత్తులోని భూమికి సమీప కక్ష్య అంటే 400 నుంచి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి వుంది. ఈ విక్రమ్–1 ప్రయోగం 2025లోనే చేయాలనుకుని కొన్ని సాంకేతిక పరమైన కారణాలతో ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


