ఐటీ కారిడార్ బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం చూసే టెక్కీలకు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ‘ఎలక్ట్రానిక్స్ సిటీ’ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సరికొత్త ‘విస్తారా ఏసీ బస్సు’ సేవలను ప్రారంభించింది.
బీఎంటీసీ లాంగ్ రూట్
దాదాపు 101 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రత్యేక రూట్ ప్రస్తుతం బీఎంటీసీ నడుపుతున్న బస్సు సర్వీసులన్నింటిలోకి అత్యంత పొడవైనది కావడం విశేషం. గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి సుమారు 40 కిలోమీటర్ల పరిధి వరకు బస్సులు నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. స్థానికంగా ఉన్న శాటిలైట్ టౌన్స్‌ను అనుసంధానిస్తూ బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
‘ప్రజా డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్‌ను ప్రారంభించాం. ఇప్పుడు ఈ 101 కిమీ రూట్ మా నెట్‌వర్క్‌లోనే అతి పెద్దది’ అని బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) జి.టి. ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రయాణ సమయం, టైమింగ్స్ వివరాలు
ఈ సరికొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులకు నిత్యం 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఉదయం 7:45 గంటలకు తుమకూరులో బయలుదేరి, ఉదయం 9:45 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుంది. (ఆఫీస్ వేళలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేశారు). ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి సాయంత్రం ఐటీ ఉద్యోగుల లాగ్-అవుట్ సమయానికి అనుగుణంగా సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:00 గంటల కల్లా తుమకూరు చేరుకుంటుంది. వన్‌వే రూట్‌లో ప్రయాణ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. ప్రధాన స్టాపులు.. తుమకూరు, నేలమంగళ, మాదవర మీదుగా ‘నైస్ రోడ్’ ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్స్ సిటీ చేరుకుంటుంది.
ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..


