అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ (Hy-Vee) భారత్‌లోని తన ఇంజినీరింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఒక్కరాత్రిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్‌కు ఆహ్వానించిన సంస్థ, రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా భారత ఇంజినీరింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి కార్పొరేట్ యాక్సెస్ కూడా నిలిపివేయబడింది.
ఈ ఘటనపై మాజీ ఉద్యోగి ఒకరు రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంటర్న్‌గా చేరి దాదాపు రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదిగిన తాను, "ఒక్క సమావేశంతో అంతా ముగిసిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సంస్థ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఎటువంటి ఆర్థిక పరిహారం కూడా అందలేదని పేర్కొన్నాడు. రియాక్ట్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ వంటి టెక్నాలజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలిపాడు.
ఈ అకస్మాత్తు తొలగింపులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగులకు కనీస నోటీసు లేకుండా మొత్తం టీమ్‌ను తొలగించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, తొలగింపుల అనంతరం సంస్థ భారత విభాగానికి సంబంధించిన లింక్డ్‌ఇన్ పేజీతో పాటు పలు పోస్టులను కూడా తొలగించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్‌ఇన్‌లో స్పందిస్తూ, భారత ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేసినట్లు ధ్రువీకరించారు. ప్రభావితమైన ఇంజినీర్లు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే ఉద్యోగుల ఆరోపణల్లో పేర్కొన్న సెవరెన్స్ ప్యాకేజీ, నోటీసు వంటి అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదీ చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?


