న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థానాన్ని కృత్రిమ మేథ (ఏఐ) ఎన్నటికీ ఆక్రమించలేదని ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఏఐతో ఐటీ కంపెనీలు మరింత పటిష్టమవుతాయని ఆయన తెలిపారు. 2030 నాటికి 400 బిలియన్ డాలర్ల భారీ ఏఐ ఆధారిత సర్వీసులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఇన్ఫీ మరింతగా దృష్టి పెడుతోందని నీలేకని చెప్పారు.
కంపెనీ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. సాంకేతిక విప్లవాలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఐటీ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్న సందేహాలపై నీలేకని స్పందించారు. జెన్‌ఏఐ మనుగడలోకి వచ్చిన మూడేళ్ల వ్యవధిలో ఇన్ఫోసిస్ మరింత పటిష్టంగా మారిందని, రాబోయే దశాబ్దకాలాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
అత్యుత్తమ కోడింగ్ టూల్స్‌ని ఉపయోగించుకుని ఉత్పాదకతను మరింతగా పెంచుకున్నప్పటికీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి జీవిత కాలంలో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయన్నారు. కంపెనీలకు అవసరమైన సొల్యూషన్స్‌కి కఠినతరమైన పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే సైబర్‌సెక్యూరిటీ, కఠినతరమైన డేటా గవర్నెన్స్‌లాంటి వాటిని బైటివాళ్లకి ఔట్‌సోర్సింగ్ చేయడానికి ఉండదని పేర్కొన్నారు.
‘పెద్ద కంపెనీల్లో ఏఐ వినియోగానికి సంబంధించి చాలా మటుకు అంతరాలు ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడమే మా పని. ఏఐ అనేది మాలాంటి కంపెనీలను ఆక్రమించదు. పరిస్థితులకు అనుగుణంగా, వేగంగా తమను తాము మల్చుకునే సంస్థలను మరింత పటిష్టం చేస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ టాప్ 200 క్లయింట్లలో 90 శాతం సంస్థలకి ఏఐ వినియోగంపరమైన సేవలు అందిస్తున్నట్లు నీలేకని వివరించారు.
ఇదీ చదవండి: రికార్డులు సృష్టిస్తోన్న ఆధార్ యాప్..


