ఫ్లాట్‌ తీసుకున్నా.. జాప్యానికి పరిహారం అడగొచ్చు | Supreme Court verdict provides relief to consumers | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌ తీసుకున్నా.. జాప్యానికి పరిహారం అడగొచ్చు

Jun 28 2026 1:31 AM | Updated on Jun 28 2026 1:31 AM

Supreme Court verdict provides relief to consumers

పొజిషన్‌ తీసుకున్నంత మాత్రాన కన్జ్యూమర్‌ హక్కులు పోవు

ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌ ఉన్నా ఫోరమ్‌ను ఆశ్రయించొచ్చు

వినియోగదారులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ : ఇల్లు లేదా ఫ్లాట్‌ను బిల్డర్‌ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా.. అప్పగింతలో జరిగిన జాప్యానికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్లాట్‌ పొజిషన్‌ తీసుకున్నంత మాత్రాన వారికి కన్జ్యూమర్‌ ఫోరమ్‌ను ఆశ్రయించే హక్కు పోదని, వినియోగదారు డిగా వారి చట్టబద్ధమైన హక్కులు రద్దు కావని తేల్చి చెప్పింది. గృహ కొనుగోలుదారులకు ఊరటనిస్తూ జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఈ తీర్పును వెలువరించింది. ఢిల్లీకి చెందిన ఒక కో–ఆపరేటివ్‌ గ్రూప్‌ హౌసింగ్‌ సొసైటీలో 2003లో ఫ్లాట్‌ పొందిన ఓ కొనుగోలుదారుడు.. ఇల్లు అప్పగించడంలో జరిగిన జాప్యానికి పరిహారం ఇప్పించాలని కన్జ్యూమర్‌ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. 

అయితే, అతడు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి, అతడిని వినియోగదారుడిగా పరిగణించలేమంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) 2016లో ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ కొనుగోలు దారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరోవైపు ఇరుపక్షాల మధ్య కుదిరిన అగ్రిమెంట్‌లో ఆర్బిట్రేషన్‌ (మధ్యవర్తిత్వ) నిబంధన ఉన్నందున, వివాదాన్ని ఆర్బిట్రేషన్‌కే పంపాలని, కన్జ్యూమర్‌ ఫోరమ్‌కు వెళ్లే అవకాశం లేదని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. 

ఈ వాదనలను విన్న అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌ కేవలం ఇల్లు అప్పగించడం గురించి మాత్రమే ఫిర్యాదు చేయడం లేదని, జరిగిన జాప్యం వల్ల కలిగిన నష్టానికి పరిహారం అడుగుతున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. అప్పగింతకు ముందు జరిగిన జాప్యానికి పరిహారం కోరే హక్కును, కేవలం ఫ్లాట్‌ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారనే ఏకైక కారణంతో నిరాకరించలేమని స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం–1986 కొనుగోలుదారులకు అదనపు రక్షణ కల్పిస్తోందని, ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌ నిబంధన ఉందన్న సాకు చూపి, వారిని చట్టబద్ధమైన ఫోరమ్‌కు వెళ్లకుండా అడ్డుకోలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

మళ్లీ విచారణ జరపాల్సిందే.. 
ఈ కేసులోని వాస్తవాలను మెరిట్‌ ఆధారంగా పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఫ్లాట్‌ తీసుకున్న తర్వాత కొనుగోలుదారుడికి కన్జ్యూమర్‌ హోదా ఉండదంటూ ఎన్‌సీడీఆర్‌సీ, కింది స్థాయి ఫోరమ్‌లు ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది. ఫ్లాట్‌ అప్పగింతలో నిజంగానే జాప్యం జరిగిందా? దానికి ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బాధ్యత వహించాలా? కొనుగోలుదారుడు పరిహారానికి అర్హుడా? అనే అంశాలపై మెరిట్‌ ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ఇరు పక్షాలకు వాదనలు, సాక్ష్యాలు సమర్పించేందుకు తగిన అవకాశం కల్పిస్తూ.. తదుపరి విచారణ కోసం కేసును తిరిగి ద్వారకలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement