సూరత్: ఏటీఎంలో విత్‌డ్రా చేసినప్పుడు కొన్నిసార్లు డబ్బులు రావు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. కానీ మన అకౌంట్‌లో అమౌంట్ కట్ అవుతుంది. అలాంటప్పుడు ఐదారు రోజుల్లో రీఫండ్ అవుతుందని బ్యాంకులు చెబుతాయి. రీఫండ్ అవుతాయి కూడా. కానీ గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తి అకౌంట్‌లోకి అమౌంట్ రీఫండ్ రాలేదు. బ్యాంకుల చుట్టూ తిరిగి, చివరకు న్యాయ పోరాటానికి దిగాడు. తొమ్మిదేళ్ల తరువాత.. అతడు కోల్పోయిన రూ.10వేలకుగాను రూ.3.28 లక్షలు వసూలు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి 2017, ఫ్రిబవరి 18న సూరత్‌లోని ఉద్నా ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎమ్‌కు వెళ్లాడు. రూ.10 వేలు విత్‌డ్రా చేసేందుకు ప్రయతి్నంచాడు. నగదు రాలేదు.. కానీ కాసేపటికి డబ్బులు కట్ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచి్చంది. అదే నెల 21న దుంభాల్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని బ్యాంకుకు మెయిల్స్ కూడా పెట్టాడు. చివరకు ఆర్బీఐని ఆశ్రయించాడు. ఏటీఎమ్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించాలని కోరాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 2017 డిసెంబర్ 20న వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.
ఆ ఏటీఎమ్ ఎస్‌బీఐకి చెందినదని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) వాదించింది. ఆ బ్యాంకుదే బాధ్యతని కోర్టుకు తెలిపింది. వినియోగదారుల ఫోరమ్ బీఓబీ వాదనను తోసిపుచి్చంది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు ఆధారాలను చూపించాలని పేర్కొంది. అంతేకాదు, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆ మొత్తాన్ని ఐదు రోజుల్లోగా రీఫండ్ చేయాల్సి ఉండగా.. బీఓబీ చేయలేదని ఫోరమ్ గుర్తించింది. బ్యాంక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. రూ.10వేలపై 9శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైనందుకుగానూ.. రోజుకు రూ.100 చొప్పున ఫైన్ వేసింది. డబ్బు పోగొట్టుకుని అతడు పడ్డ మానసిక వేదనకు రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.2,000.. ఈ పరిహారం మొత్తం రూ. 3,28,800గా నిర్ణయించింది. వినియోగదారునికి చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.


