బాబు సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే ఆక్వా సంక్షోభం | Aqua crisis due to Babu government negligence | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ నిర్లక్ష్యం వల్లే ఆక్వా సంక్షోభం

Jul 29 2026 5:47 AM | Updated on Jul 29 2026 5:47 AM

Aqua crisis due to Babu government negligence

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆక్వా రైతుల ఆగ్రహం    

ఫీడ్, సీడ్‌ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు

రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి

రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేయాలి

తక్షణమే ఒక సమగ్ర పాలసీ తీసుకురావాలని డిమాండ్‌

సాక్షి, అమరావతి: అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్న ఆక్వా రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని, సీడ్, ఫీడ్‌ కంపెనీల సిండికేట్‌ను కట్టడి చేయకపోవడం వల్లనే ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆక్వారైతుల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఓ వైపు నాణ్యమైన సీడ్‌ దొరకడం లేదు. వైరస్‌లు విజృంభిస్తున్నాయి. అప్సడా చట్టానికి తూట్లు పొడుస్తూ కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి ఇష్టానుసారం ఫీడ్‌ రేట్లు, మందులు, ఆక్వా పరికరాల ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది’ అని సమావేశంలో పాల్గొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమస్యలపై మంగళవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన రౌండ్‌ టేబుల్‌  సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఆక్వారైతులు పాల్గొన్నారు. ‘‘ప్రాసెసింగ్‌ కంపెనీలు అడ్డూ అదుపు లేకుండా కౌంట్‌ ధరలకు అడ్డగోలుగా కోతలేస్తుండడంతో ఆక్వా రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారు.  జోన్, విస్తీర్ణంతో సంబం«ధం లేకుండా ఆక్వా సాగు చేసే రైతులందరికి యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరాతో సహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.’’ అని ఆక్వా రైతులు  పేర్కొన్నారు. 

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోవడానికి  తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్రమైన పాలసీని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కంపెనీలు ఏకపక్షంగా పెంచిన ఫీడ్‌ ధరలు పూర్తిగా తగ్గించాలని లేదా ఆ మేరకు ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరించాలని రైతులు కోరారు. ఆక్వా రైతుల కోసం ప్రత్యేకంగా రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్నారు.

ఎన్నికల హామీ మేరకు యూనిట్‌ రూ.1.50కే విద్యు­త్‌ సరఫరాతో పాటు, పెండింగ్‌ లో ఉన్న విద్యుత్‌ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జమలయ్య డిమాండ్‌ చేశారు. సదస్సులో అఖిల భారత కిసాన్‌ మహాసభ అధ్య­క్షులు తోట ఆంజనేయులు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్‌ బాబు, కాకి­నాడ జిల్లా ఆక్వా రైతుసంఘం నాయకులు సురేష్‌ కొమార్తి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు.

అప్పుల ఊబిలో ఆక్వా రైతులు.. 
రాష్ట్రంలో తీర ప్రాంత జిల్లాల్లో  సిరులు కురిపించే రంగంగా వెలుగొందిన ఆక్వా రంగం నేడు తీవ్రసంక్షోభంలో కొట్టుమిట్టాడు తుందని ఏపీæ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎం ఎస్‌ నాగిరెడ్డి పేర్కొ­న్నారు. అంతర్జాతీయ మార్కెట్‌­లో ఒడిదుడుకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, దళారులు, కంపెనీల సిండికేట్‌ దోపిడీ.. వెరసి దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఆక్వా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారని చెప్పారు.

కాకినాడ జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు రామచంద్రరావు మాట్లాడుతూ కేజీ రొయ్యల ఉత్పత్తికి  రూ.280 ఖర్చవుతుంటే, ప్రాసెసింగ్‌ కంపెనీలు మాత్రం కేవ­లం రూ.­240లోపే చెల్లిస్తున్నారని మండిపడ్డా­రు. కోనసీమ జిల్లా ఆక్వారైతు సంఘం నాయకులు గడ్డం ప్రభాకర్‌ మాట్లాడుతూ వైట్‌ గట్, వైట్‌ స్పాట్‌ విబ్రియే, లూజ్‌ షెల్‌ తదితర వ్యాధుల నివారణకు శాస్త్రీయమైన పరిశోధన జరిపి తక్కువ ధరలకు మందులు అందించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement