జబర్దస్త్ అనగానే కామెడీ, పంచులు, విభిన్నమైన గెటప్స్ గుర్తుకొస్తాయి. ఆ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారు ఉన్నారు. అదే షోతో వివాదాలపాలు అయినవారూ ఉన్నారు. అలా దగ్గరయిన వారే కొమురం. తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు లేడీ గెటప్స్‌తో అలరించిన ఆయన.. యాంకరింగ్ చేస్తూ కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాలో కొమురం కాస్త నాగులుగా కనిపించి మరో సారి ప్రేక్షకులను ఆశ్చర్చపరిచాడు.
మరో కోణం..
కామెడీతో నవ్వించిన నటుడు.. సీరియస్ విలనిజంలో మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ ఇది కూడా సాధ్యం అవుతుందని కొమురం నిరూపించాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో నాగులుగా కనిపించాడు. సీరియస్ బాడీ లాంగ్వేజ్, హావాభావాలు, డైలాగ్ డెలివరీతో విలన్ పాత్రకు న్యాయం చేశాడు. కామెడీగా పరిచయం అయిన ప్రేక్షకులకు సినిమాలో నెగెటివ్ షేడ్‌లో కనిపించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. దాదాపు 12 సంవత్సరాలు కొమురక్క పాత్రలో కనిపించి ఒక్కసారిగా విలన్‌గా మారిన తన అనుభవాన్ని, తనకు ఈ అవకాశమిచ్చిన వారికోసం మూవీ సక్సెస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ డైరెక్టర్‌తో సహ అక్కడ ఉన్న వారిని కంటితడి తెప్పించాడు.
నా ఫోన్ మోగుతూనే ఉంది..
‘ నన్ను చాలా మంది అవమానించారు. నాతో కలిసి రూమ్‌లో ఉన్న దాదాపు 15మంది డైరెక్టర్స్ అయ్యారు. నాకోసం వారికి పూర్తిగా తెలుసు. కానీ వాళ్లు నాలో నటుడిని మాత్రం గుర్తించలేకపోయారు. శివ నిర్వాణ ఎవరో తెలీదు. కానీ ఈ పాత్ర ఇచ్చారు. మూడు రోజుల నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ఈ డైరెక్టర్ వల్లే కొమురక్క నుంచి నాగులుగా మారిపోయా. 12 ఏళ్లగా నన్ను చూసిన భార్య ‘ఇరుముడి’ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయింది. నేను మరణించే వరకు శివ నిర్వాణ అన్నను మర్చిపోను. ఒక వేళ మర్చిపోతే మనిషినే కాను’ అంటూ భావోద్వేగానికి గురవుతూ మాట్లాడాడు.
ప్రశంసల వెల్లువ
మొత్తానికి ఇప్పటి వరకు నవ్వించిన కొమరం.. నాగులుగా మెప్పించాడు. కామెడీ నటుడిగా ముద్ర పడిన ఓ ఆర్టిస్ట్.. చాలా అనుభవం ఉన్న సీరియస్ నెగిటివ్ రోల్‌లో నటించి తన సత్తా చాటుకోవడం విశేషమనే చెప్పాలి. అటు తన నటన చూసిన ప్రేక్షకులు సైతం అతన్ని మెచ్చుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: డూప్‌నకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్..!


