సల్మాన్ ఖాన్ బాడీ డబుల్( డూప్) పర్వేజ్ కాజీ ఇటీవల అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో నిజం లేదని పర్వేజ్ మేనేజర్ పీయూష్ స్పష్టం చేశారు. ఆగస్టు 6న ఇంట్లో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యులను సంప్రదించామని. పరీక్షల అనంతరం ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. వైద్యులు స్వల్పంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు.
వెంటనే సాయం చేశారు..
‘పర్వేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే సల్మాన్ ఖాన్ స్పందించారు. మెరుగైన వైద్యం అందేలా స్వయంగా అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. సల్మాన్ సర్ పర్వేజ్‌ను తమ్ముడిలా భావిస్తారు. విషయం తెలిసిన వెంటనే సాయం చేశారు’ అని పీయూష్ చెప్పారు. కాగా ప్రస్తుతం పర్వేజ్ కోలుకుంటున్నారని, మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
షూటింగ్‌పై ప్రభావం..
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నయనతారతో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం ‘మాన్‌స్టర్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో ఉన్నారు. పర్వేజ్ ఆరోగ్య కారణాలతో కొన్ని రోజులు విరామం తీసుకోవడంతో యాక్షన్ సన్నివేశాలపై ప్రభావం పడుతుందనే వార్తలు వచ్చాయి. ఆయన తిరిగి సెట్స్‌కు వచ్చిన తర్వాత స్టంట్ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసి, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ముంబై ఫిల్మ్ సిటీలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో అఫ్గాన్ గ్రామాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. కొరియన్ యాక్షన్ బృందం కూడా స్టంట్స్ కోసం పనిచేస్తోందట. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
ఎవరీ పర్వేజ్ కాజీ?
పర్వేజ్ కాజీ చాలా ఏళ్లుగా సల్మాన్ ఖాన్‌కు బాడీ డబుల్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘రేస్ 3’, ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ తదితర చిత్రాల్లో సల్మాన్‌కు డూప్‌గా కనిపించారు.
ఇదీ చదవండి: త్వరలో రాబోయే థిల్లర్ సినిమాపై కాపీరైట్ వివాదం..!


