కర్ణాటకలో బిగ్‌ ట్విస్ట్‌.. నాపై స్టింగ్‌ ఆపరేషన్‌: డీకే సంచలన వ్యాఖ్యలు | CM DK Shivakumar Sensational Claim On Sting Operation | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో బిగ్‌ ట్విస్ట్‌.. నాపై స్టింగ్‌ ఆపరేషన్‌: డీకే సంచలన వ్యాఖ్యలు

Oct 9 2026 8:56 AM | Updated on Oct 9 2026 8:56 AM

CM DK Shivakumar Sensational Claim On Sting Operation

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తనపై, మంత్రులపై స్టింగ్‌ ఆపరేషన్‌ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఉన్నది ఎవరో, ఆర్థిక వనరులు సమకూర్చింది ఎవరో తనకు బాగా తెలుసని అన్నారు. అయితే ఇప్పుడే అన్ని విషయాలు బయటపెట్టనని, సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.

గురువారం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడిన సీఎం డీకే శివకుమార్‌.. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌ కోసం కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని, అవసరమైతే వారి ఫొటోలను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

స్టింగ్‌ ఆపరేషన్‌ చేసిన వారెవరో ప్రకటించాలని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన సవాలుపై డీకే ఘాటుగా స్పందించారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు, నైస్‌ ప్రాజెక్టు కుమారస్వామి చేసిన తప్పుల్లో ఒకటని ఆరోపిస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సమయం వచ్చినప్పుడు అసెంబ్లీలో వెల్లడిస్తానని అన్నారు. కుమారస్వామి కుటుంబానికి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ప్రశ్నించారు.

డీకే వ్యాఖ్యలకు కుమారస్వామి కౌంటర్‌
సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఎదురుదాడికి దిగారు. నైస్‌ ప్రాజెక్టులో అక్రమాలపై ఆధారాలతో సహా ప్రశ్నలు లేవనెత్తడంతోనే సీఎం డైవర్షన్‌ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. నైస్‌ ప్రాజెక్టు అంశంపై చర్చ జరగకుండా ఉండేందుకే స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. సీఎంను కలిసేందుకు వచ్చే వారు ఫోన్లను బయటే వదిలి వెళ్లాలని సూచించిన కుమారస్వామి.. స్టింగ్‌ ఆపరేషన్‌ పేరుతో ట్రాప్‌ చేసినవారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. గతంలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి వ్యవహారంలో ఎవరు ఉన్నారో, మాజీ మంత్రి రాజణ్ణ ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు.

ఇలా ఒకవైపు స్టింగ్‌ ఆపరేషన్‌ వెనుక ఎవరున్నారో తనకు తెలుసంటూ డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించడం, మరోవైపు నైస్‌ ప్రాజెక్టు అక్రమాల అంశాన్ని కుమారస్వామి ప్రస్తావించడంతో కర్ణాటక రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అసలు స్టింగ్‌ ఆపరేషన్‌ వెనుక ఎవరున్నారు? ఆర్థిక సహకారం అందించింది ఎవరు? డీకే చెబుతున్న ఆధారాలు ఎప్పుడు బయటకు వస్తాయి? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇదీ చదవండి: అంబానీనే కాదు.. ఇంకో బాస్‌ కూడా ఉన్నాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement