మైనర్లను రవాణా చేస్తే ‘పోక్సో’ వర్తింపు  | POCSO Act applies to minor victims of commercial sex trafficking | Sakshi
Sakshi News home page

మైనర్లను రవాణా చేస్తే ‘పోక్సో’ వర్తింపు 

Jun 1 2026 4:51 AM | Updated on Jun 1 2026 6:36 AM

POCSO Act applies to minor victims of commercial sex trafficking

సుప్రీంకోర్టు కీలక తీర్పు  

న్యూఢిల్లీ: ధన సంపాదనే ధ్యేయంగా లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణాకు గురైన బాధితుల్లో మైనర్‌ ఉంటేనే   భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), అనైతిక అక్రమ రవాణా–నివారణ(ఐటీపీఏ) చట్టాలతోపాటు పోక్సో చట్టాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 

సెక్స్‌ వర్కర్లకు సంబంధించిన అంశాలతోపాటు నేరస్థులపై విచారణ, బాధితుల పునరావాసం కోసం చట్టపరమైన నిబంధనల పాటించాలని సూచిస్తూ జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. నేరస్థుల చర్యలు, ఉద్దేశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. మానవ అక్రమ రవాణా నేరంలోని అంశాలు రుజువైన తర్వాత బాధితురాలు ‘అంగీకరించింది’ అనే ఏ వాదన లేదా ఆరోపణ అయినా అసంబద్ధమైనదిగా పరిగణించాలని తేల్చిచెప్పింది. 

ఒక మహిళ తాము లైంగిక పరిశ్రమలో, వ్యభిచారంలో ఉన్నామని తెలుసుకున్నంత మాత్రాన, వారు మానవ అక్రమ రవాణా బాధితులు కాకుండా పోరని స్పష్టంచేసింది. ఎందుకంటే పని పరిస్థితుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చి వారిని మోసగించి ఉండవచ్చని, ఆ పరిస్థితులు తరువాత దోపిడీకి గురిచేసేవిగా తేలి ఉండవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, లైంగిక దోపిడీకి గురైన బాధితులకు హక్కులను అమలు చేయాలంటూ ప్రజ్వల  స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది. 

లైంగిక దోపిడీకి గురైనవారికి పునరావాసం కల్పించకపోతే.. బాధితురాలు తిరిగి ఆ పాత పరిస్థితుల్లోకే వెళ్తుందని వెల్లడించింది.  అందువల్ల బాధితులకు తగిన పునరావాసం కల్పించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 21, 23 ఇదే అంశాన్ని సూచిస్తున్నాయని గుర్తుచేసింది. లైంగిక దాడి కోసం ఒక బాలికను అక్రమ రవాణా చేస్తే పోక్సో చట్టంలోని నిబంధనలతోపాటు బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 143, 144, ఐటీపీఏ చట్టంలో సెక్షన్లను వర్తింపజేయాలని కోర్టు స్పష్టంచేసింది. చట్ట ప్రకారం పిల్లలపై జరిగే ప్రతి లైంగిక దోపిడీ చర్య వారి అంగీకారం లేకుండానే జరుగుతుందనే విషయంలో  అస్పష్టత లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement