పెళ్లి పేరుతో మోసం కేసుల్లో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
చట్టంలో ‘మహిళ’అంటే కేవలం స్త్రీలు మాత్రమేనని స్పష్టీకరణ
లింగమార్పిడి చేయించుకున్నా పుట్టుకతో వచ్చిన లింగానికే చట్టబద్ధత
వేధింపులకు గురైతే ట్రాన్స్జెండర్ చట్టం కింద ఫిర్యాదుకు అవకాశం
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను ప్రస్తావించిన న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో దాఖలయ్యే కేసుల్లో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టంలోని ట్రాన్స్జెండర్(ట్రాన్స్జెండర్)కు సంబంధించిన 69వ సెక్షన్ వర్తించబోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టంలోని సెక్షన్లో పేర్కొన్న మహిళ అనే పదానికి ‘స్త్రీలు’ మాత్రమే పరిగణనలోకి వస్తారని తేల్చిచెప్పింది.
ఓ కేసులో అరెస్టయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పుట్టుకతో పురుషుడు లేదా స్త్రీగా ఉండి లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా మరో లింగానికి మారినప్పటికీ వారు ట్రాన్స్జెండర్గానే పరిగణించబడతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. బీఎన్ఎస్ 69లో పేర్కొన్న ‘మహిళ’ అనే పదం కింద కేవలం స్త్రీలు మాత్రమే వస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారం వారు పూర్తిస్థాయి పురుషుడు లేదా స్త్రీ కాలేరని తేల్చిచెప్పింది.
ఆ చట్టం కింద రక్షణ..
ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) చట్టం–2019 కింద గుర్తింపు ఉందని కోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్జెండర్లు ఏదైనా శారీరక, లైంగిక వేధింపులకు గురైతే ఈ చట్టంలోని సెక్షన్ 18(డి) కింద ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. దీని ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని వివరించింది.
అసలేం జరిగింది?
బరేలీ పోలీసు స్టేషన్లో నమోదైన ఓ కేసులో మహ్మద్ సాకిర్ అలియాస్ మహ్మద్ సకీర్ అనే వ్యక్తి బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర పాటు తనతో సంబంధం కొనసాగించాడని, రూ.5 లక్షలు తీసుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించి కుటుంబ సభ్యులతో కలిసి దూషించారని ఓ ట్రాన్స్జెండర్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది.
వైద్య నివేదిక కీలకం..
విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది కృష్ణగోపాల్ వాదనలు వినిపించారు. ‘‘ఫిర్యాదుచేసిన వ్యక్తి పుట్టుకతో పురుషుడు. 2023 ఏప్రిల్లో శస్త్రచికిత్స ద్వారా లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. వైద్య బోర్డు నివేదిక ప్రకారం అతడు ఇప్పుడు అమ్మాయిగా మారినా గర్భాశయం లేదు. అవయవ మార్పిడి చేసుకున్నాసరే అతను పురుషుడే.
అందుకే ఈ కేసుకు బీఎన్ఎస్ చట్టంలోని 69వ సెక్షన్ వర్తించదు’’ అని వాదించారు. చట్టబద్ధంగా లింగ మార్పిడి కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదనే అంశాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం నిందితుడిపై బీఎన్ఎస్ 69 కింద కేసు నమోదుకు తగిన కారణాలు లేవని తెలుపుతూ అతడికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ప్రభుత్వం తరఫున అదనపు ప్రభుత్వ న్యాయవాది రామ్ వర్మ వాదనలు వినిపించగా, అమికస్ క్యూరీగా న్యాయవాది మయూరి వ్యవహరించారు. బీఎన్ఎస్లో అవసరమైన సవరణలు తీసుకువచ్చి, అత్యాచారం చట్టం పరిధిలోకి ట్రాన్స్వుమెన్ను చేర్చాలని 2023లో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన విషయాన్ని న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించింది. పార్లమెంటు ఆ నివేదికను ఆమోదించలేదని, అందుకే బీఎన్ఎస్లో మహిళ అనే పదం కింద ట్రాన్స్వుమెన్ రాదు అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.


