కోమాలో ఉన్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును వారి కుటుంబ సభ్యులు, తమపై ఆధారపడినవారి అవసరాల కోసం వినియోగించుకునేలా చట్టపరమైన విధానం రూపొందించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఖాతాలోని డబ్బును పొందేందుకు స్పష్టమైన చట్టపరమైన మార్గం లేకపోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
జస్టిస్ అజిత్ కుమార్, జస్టిస్ గరిమా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం పర్వీన్ జహాన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించింది. కోమాలో ఉన్న తన భర్త బ్యాంకు ఖాతాలోని సొమ్మును ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఆమె భర్త మరణించారు. ఈ పరిణామం సమస్య తీవ్రతను ఈ ధర్మాసనం మరింత స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
పర్వీన్ జహాన్ భర్త షంషాద్ అలీ 2021 నుంచి కోమాలో ఉన్నారు. కుటుంబానికి వైద్యం, రోజువారీ ఖర్చుల కోసం డబ్బు అవసరమైంది. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఉపయోగించేందుకు తనను గార్డియన్‌గా గుర్తించాలని ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వైద్య పరీక్షలు చేయించింది. వైద్య నివేదికలో ఆయన నిజంగానే కోమాలో ఉన్నారని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడైంది. ఇంతలో 2026 అక్టోబర్ 8న షంషాద్ అలీ మరణించారు. అంటే, ఆయన బతికుండగానే బ్యాంకు డబ్బును వినియోగించుకునే అవకాశం కుటుంబానికి లభించలేదు. ఇదే విషయంపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
కేంద్రం, ఆర్‌బీఐకి ఆదేశాలు
కోమాలో ఉన్న వ్యక్తుల పొదుపు ఖాతాల్లోని డబ్బును తగిన ధ్రువీకరణ, రక్షణ చర్యలతో వారిపై ఆధారపడినవారికి అందించే వ్యవస్థ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని లేదా జాతీయ బ్యాంకులు, వాటి అనుబంధ బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రించే ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది. ఈ అంశంపై ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయా? లేక కొత్తగా ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అనే విషయాలను వివరిస్తూ కేంద్రం, ఆర్‌బీఐ అఫిడవిట్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. స్పందించకపోతే సంబంధిత అధికారులను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇదే సమయంలో, కేరళ హైకోర్టు శోభా గోపాలకృష్ణన్ వర్సెస్ కేరళ స్టేట్ కేసులో రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదుపరి విచారణలోగా స్పష్టమైన పరిష్కారాన్ని సమర్పించాలని, విఫలమైతే వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొంది. కేసు తదుపరి విచారణ నవంబరు 6న జరగనుంది. ఈ వ్యవహారం పరిష్కారమైతే, తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించలేని వ్యక్తుల కుటుంబాలకు కీలక ఉపశమనం లభించే అవకాశముంది.
ఇదీ చదవండి: మార్కెట్లను కుదిపేసిన అమ్మకాల ఒత్తిడి


