ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.
ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్‌మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.
వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. నవభారత్‌కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్‌చుక్ కోరారు.


