సాక్షి, తాడేపల్లి: నీట్ పరీక్షల వైఫల్యాలకు బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని ఏపీ జెన్-జి అడుగుతోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయటపెట్టారు. చంద్రబాబు ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నారు.
లోకేష్ కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేకపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మేం స్వాగతిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకుని లోకేష్ కూడా రాజీనామా చేయాలి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. డీఎస్సీ అవకతవకలపై 300లకు పైగా కేసులు కోర్టులో ఉన్నాయి. డీఎస్సీ అభ్యర్ధుల ఎదురుచూపులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. మాయమాటలు చెప్పి తమకు నచ్చిన అభ్యర్థులకు జీవోలు తెచ్చి ద్వారాలు తెరిచారు’’ అంటూ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు.
‘‘పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చారు. స్పోర్ట్స్ అసోసియేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం ఉద్యోగాలిచ్చేశారు. డీఎస్సీలో మోసం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. నారా లోకేష్ ఏపీ జెన్-జికి సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై జూలై 28న నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎప్పుడు రాజీనామా చేస్తారో నారా లోకేష్ సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై మా పోరాటం కొనసాగిస్తాం. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’’ అని ఆదిమూలపు డిమాండ్ చేశారు.


