నల్లగొండ టూటౌన్ : యువ ఇంజనీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో బుధవారం ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన యువ ఇంజనీర్లు ద్వారా నవ భారత నిర్మాణం సాగాలన్నారు. దేశం సేవారంగం నుంచి ఉత్పత్తి ఎకనామీగా రూపాంతరం చెందడానికి యువ ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరమని చెప్పారు. సామాజిక సంక్లిష్టతలను ఆకలింపు చేసుకొని పరిష్కారం కోసం పరిశోధనలు చేసినప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమని తెలిపారు. ఇటీవల ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జర్మనీ, స్విజర్లాండ్ పర్యటనలో సాంకేతికతను జోడించి ముందుకు సాగడం ద్వారా భారత్ విశ్వగురువుగా మారడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు.. కోర్సులు, నైపుణ్యాల వృద్ధి, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ హరీష్‌కుమార్, అధ్యాపకులు సంధ్యారాణి, సుధారాణి, జయంతి, ప్రొఫెసర్ సాంబశివరావు, రఘుమారావు, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


