కట్టంగూర్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కట్టంగూర్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, సైన్స్‌ల్యాబ్, పరిసరాలను, విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కాముల శ్యామలశేఖర్ మండలకేంద్రంలో నెలకొన్న మంచినీటి, లోఓల్టేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, విద్యుత్ శాఖ ఏఈలకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
నిడమనూరు : మండలంలోని ఎర్రబెల్లి పంచాయతీ నిధుల వినియోగంపై డీఎల్‌పీఓ రాఘవరావు బుధవారం విచారణ చేపట్టారు. రికార్డులను సీజ్ చేసి తీసుకవెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని స్థానికుడు లకుమాల మధు ఆరోపణల నేపథ్యంలో ఎర్రబెల్లి పంచాయతీ పాలకవర్గం, స్థానికులు సమక్షంలో ప్రాథమికంగా రికార్డులను స్వాధీనం చేసుకొని రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. పంచాయతీ రికార్డులు పరిశీలించి నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి, కలెక్టరుకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐతగోని మధు, ఉప సర్పంచ్ నవీన్‌కుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు షహీరాసుల్తాన్, మురళీనాయక్, స్థానికులు ఉన్నారు.
విద్యార్థులకు దిక్సూచి.. ఏఐఎస్‌ఎఫ్
నల్లగొండ టౌన్ : విద్యార్థులకు దిక్సూచి ఏఐఎస్‌ఎఫ్ అని ఆ సంఘం మాజీ నాయకుడు మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. బుధవారం ఏఐఎస్‌ఎఫ్ వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండలో ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బరిగల వెంకటేష్, ముదిగొండ మురళీకృష్ణ, సూర్య తేజ, శ్రీకాంత్, అరవింద్, మనోహర్, తేజ, సాయి, అరుణ్ పాల్గొన్నారు.
టిప్పర్లు, డంపర్లకు లోడ్ కవర్ తప్పనిసరి
నల్లగొండ : వాహనదారుల భద్రత, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిప్పర్లు, డంపర్లకు ఆటోమేటిక్ లోడ్ కవర్ వ్యవస్థను తప్పనిసరి చేయనున్నట్లు నల్లగొండ ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2027 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలని పేర్కొన్నారు. టిప్పర్లు, డంపర్ల యజమానులు, డ్రైవర్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని పేర్కొన్నారు.


