40 రోజులపాటు 28 నగరాల్లో ప్రచారోద్యమం
అహ్మదాబాద్/భోపాల్/నాగ్‌పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది.
నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్‌లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు.
పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు.
పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్‌వర్క్‌ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్
పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్‌లో ఆ రోపించారు.


