breaking news
Ruchika Singh
-
‘మోదీజీ.. నా జీవితాన్ని నరకం చేశారు’
జంతర్ మంతర్ నిరసనల సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణలు చెప్పడం, బాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేయడం.. ఆయన క్షమించేయడం.. పోలీసులు ఉండదని చెప్పడంతో ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయిందని అంతా భావించారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన మరో వీడియో నెట్టింటకు చేరింది.తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో.. ‘మోదీజీ.. మీరు నా జీవితాన్ని నరకం చేశారు’ అంటూ ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. ఘటన తర్వాత తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పినట్లు ఉంది. ‘‘మీరు నన్ను ఎంతగా వెంటాడారంటే.. ప్రతిచోటా వేధింపులకు గురయ్యాను. ఎక్కడికెళ్లినా ముఖం దాచుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె అందులో చెప్పినట్లు ఉంది. ఈసారి తాను వెనక్కి తగ్గబోనని, కోల్పోవడానికి తన వద్ద ఏమీ లేదని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ దీనిని తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశాయి. బాలికను బెదిరించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారని ఇరు పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు.. బాలిక తరఫు న్యాయవాది మాత్రం ఆ వీడియో ఏఐ జనరేటెడ్ కాదని, అందులో ఉందని ఆమెనేనని వ్యాఖ్యానించారు. కానీ, ఆ వీడియో ఎప్పుడు తీశారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.జులై 23న జంతర్ మంతర్ నీట్ నిరసనల సమయంలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సదరు బాలిక తిట్టిపోసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చాందెల్ ఫిర్యాదు చేయడంతో జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసును దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేశారు. తొలుత ఆమె వయసును పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పుగా పేర్కొన్నారు. అయితే.. తన వయసు 15 ఏళ్లేనని.. కొందరు రెచ్చగొట్టి అలా మాట్లాడించారని ఆ తర్వాత ఆమె క్షమాపణలు చెప్పింది.మకాం మార్చేసి..జంతర్ మంతర్ ఘటన వివాదం, కేసు భయంతో ఆమె కుటుంబం ఆందోళనకు గురైంది. తమకు వేధింపులు వస్తున్నాయని, తన బిడ్డ చేసిన తప్పును పెద్ద మనుసుతో మన్నించాలని తల్లి, ప్రధాని మోదీని వేడుకుంది. ఆ తర్వాత నోయిడాలోని నివాసాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం హరియాణాలో తల్లిదండ్రులతో ఉంటున్నట్లు తెలిసింది.‘యువతకు మరో అవకాశం ఇవ్వాలి’ఈ వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ ఘటనలో పాల్గొన్న యువతపై కఠిన చర్యలకు బదులుగా వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వాలని అన్నారు. దీంతో వివాదం క్రమంగా సద్దుమణిగినట్లు కనిపించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో ఈ వ్యవహారం మళ్లీ రాజకీయ చర్చకు వచ్చింది. ఇదీ చదవండి: డింపుల్.. మామూలు దూకుడు కాదది! -
ఇక కేసు లేనట్లే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మైనర్ బాలికకు ఊరట లభించింది. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో భాగంగా వైరల్ అయిన వీడియోలో బాలిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.తొలుత నోయిడా పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని, ఇతరుల ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వెల్లడించింది. “నేను చేసినది క్షమించరాని తప్పు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇది నా మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆ బాలిక వీడియోలో పేర్కొంది.మోదీ క్షమాభిక్ష.. మారిన పరిణామాలుఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. “అలాంటి పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని క్షమించాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ బాలికపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కూతురిని క్షమించాలని తల్లి విజ్ఞప్తిబాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. “మోదీ గారు గొప్ప మనసుతో నా కుమార్తెను క్షమించారు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నాను” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని ప్రధానిని కోరారు. చిన్నారులు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.CJP నిరసనల నేపథ్యంలో ఘటననీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసనలు నిర్వహించింది. ఎక్కువగా విద్యార్థులు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడంతో గత నెలలో ఈ నిరసనలను విరమించారు. అయితే నిరసనల సమయంలోనే నోయిడాకు చెందిన బాలిక.. రెచ్చిపోయి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఓ సుప్రీం కోర్టు లాయర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ప్రధాని క్షమాభిక్ష.. పోలీసుల నిర్ణయం.. మైనర్ బాలికకు భారీ ఊరట లభించినట్లయింది. -
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
రుచికా సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం.


