బంగారం.. బంగారం.. బంగారం.. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలతో ఇప్పుడు గోల్డ్ హెడ్‌లైన్స్ అవుతోంది.. బ్రేకింగ్ న్యూస్‌గా మారుతోంది. కానీ, ఓ చోట సమాధుల్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికిందంటే మీరు నమ్ముతారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6,600 సంవత్సరాల క్రితమే.. ఆ సమాధుల్లో బంగారాన్ని పెట్టారని, ఆ కాలంలోనే బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చారని తెలిస్తే.. షాకవుతారు కదా? ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాం. వివరాలను చదవాల్సిందే.
62 సమాధులు.. కిలోల కొద్దీ బంగారం..
అది బల్గేరియాలోని వర్ణా అనే నగరంలో ఉన్న శ్మశానం..! ప్రాంతం. 1972లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం, మరో వైపు, కార్మికుల నివాస సముదాయాలు ఉండే ఆ ప్రాంతంలోని శ్మశానంలో జరిపిన తవ్వకాలతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అక్కడ మొత్తం 300 సమాధులు బయటపడగా.. వాటిల్లో 62 సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు లభించాయి.
పరిశోధనల్లో ఏం తేలిందంటే..
అందమైన నగలే కాకుండా.. రాజదండం, ఇతరత్రా రాచముద్రల రూపంలోనూ బంగారం లభ్యమైంది. కార్బన్ డేటింగ్ వంటి తదనంతర పరిశోధనల్లో తేలింది ఏమిటంటే.. ఆ సమాధుల్లోని మృతదేహాలు క్రీస్తు పూర్వం 4600 నుంచి 4300 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. అంటే.. మనముంటున్న కాలంతో పోలిస్తే.. దాదాపు 6 వేల సంవత్సరాల కిందటివన్నమాట. అంటే.. అప్పట్లోనే బంగారంపై మోజు ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు.
ఏకంగా మృత కళేబరానికి..
ఈ సమాధుల్లో ‘గ్రేవ్ 43’ ఏకంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆ సమాధిలో కిలోన్నరకుపైగా బంగారం ఓ మృతదేహం వద్ద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అతను మృతిచెందినప్పుడు 60 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. అంతలా బంగారం లభించడాన్ని బట్టి.. అతను సంబంధిత తెగకు నాయకుడై ఉంటారని భావించారు. గ్రేవ్ 43లో ఏకంగా మృత కళేబరానికి బంగారు గొలుసులు, చేతి కంకణాలు, చెవిపోగులున్నాయి. దీంతోపాటు.. బంగారు రాజదండం, బంగారు పూత పూసిన ఆయుధం ఆ సమాధిలో లభించాయి.
అబ్బురపరిచే అద్భుత శైలి
ఇప్పుడు ఈ సమాధులు ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయంటే.. మీకు తెలిసిందే..? బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుక్కారణం ప్రజల్లో బంగారంపై మోజు పెరగడమే..! భారత్‌లో బంగారు ఆభరణాలు స్టేటస్‌కి నిదర్శనమైతే.. విదేశాల్లోనూ వేల ఏళ్ల క్రితమే అంతటి క్రేజ్ ఉందని ఈ సమాధులు స్పష్టం చేస్తున్నాయి. మెషీన్‌లతో కాకుండా.. పూర్తిస్థాయిలో చేతితో చేసిన బంగారు ఆభరణాలు అంత అద్భుత శైలిలో తయారు చేయడం ఇప్పటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి.
6,600 ఏళ్ల క్రితమే..
అంటే.. 6,600 ఏళ్ల క్రితమే బంగారాన్ని కనుక్కొన్నారనే విషయం ఒక ఎత్తయితే.. దాన్ని శుద్ధి చేసి, హ్యాండీక్రాఫ్ట్ మాదిరిగా చేతితోనే ఆభరణాలుగా మార్చడం మరో విశేషం. అంతేకాదు.. ఆ కాలంలోనే సంపద అనేది సమాజంలో విభజనకు కారణమనే విషయం స్పష్టమైంది. వర్ణా శ్మశానంలో బయటపడ్డ 300 సమాధుల్లో కేవలం 62 గ్రేవ్స్‌లో మాత్రమే బంగారు ఆభరణాలుండడం ఇందుకు నిదర్శనం. సింధూనాగరికత సమయంలో కోటల్లో ఎగువ వర్గాలు.. కోట బయట దిగువ స్థాయి వర్గాలుండేవని చదువుకున్న విషయం తెలిసిందే..! ఈ సమాధులను పరిశీలిస్తే.. 6,600 ఏళ్ల క్రితమే బల్గేరియాలో కూడా ఇలాంటి సామాజిక ఆంతర్యాలున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమాధుల్లోంచి వెలికి తీసిన ఆభరణాలు ప్రస్తుతం బల్గేరియాలోని వర్ణా ఆర్కియాలజికల్ మ్యూజియంలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి.


