సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 16 ఏళ్ల శౌర్య పటిల్ అనే విద్యార్థి, తన స్కూల్‌లో టీచర్ల అవమానాలు, ఒత్తిడి కారణంగా మెట్రో స్టేషన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి మరణానికి దారితీసిన పరిణామాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియలో అతనిని చివరిసారిగా చూసిన దీప్షిక అనే ప్రధాన సాక్షి వివరణ పోలీసు విచారణకు కీలక ఆధారంగా మారింది.
ఇ-రిక్షాలో జరిగిన బాధాకర ఘటన
45 ఏళ్ల గృహిణి అయిన దీప్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన కుమారుడు, మరొక విద్యార్థితో మధ్యాహ్నం 2.15 గంటలకు పాఠశాల వెలుపల ఇ-రిక్షాలో ఎక్కారు. కొద్దిసేపటికి అదే వాహనంలో ఆ విద్యార్థి కూడా వారితో చేరాడు. ప్రారంభం నుండి అతడు తీవ్రంగా ఆందోళనలో ఉన్నట్లుగా కనిపించాడని ఆమె తెలిపింది.
ఏడాది పొడవునా హింసించారు: విద్యార్థి వేదన
ఆ విద్యార్థిని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడిగినప్పుడు సదరు విద్యార్థి పాఠశాలలో అవమానాలు, మందలింపులు ఎదురవుతున్నాయని, ఏడాది అంతా ఒత్తిడి చేస్తూ ప్రతి చిన్న తప్పులకు కూడా తన తల్లిదండ్రులను పదేపదే పిలిపించారని వేదనతో చెప్పాడని ఆమె వెల్లడించింది. అందులో ప్రధానంగా నలుగురు ఉపాధ్యాయుల పేర్లు ప్రస్తావిస్తూ వారి వల్లే నేను ఇబ్బందులు పడుతు న్నట్లు తనకు చెప్పినట్లు దీప్షిక అనే మహిళ స్పష్టం చేసింది. తరచుగా పాఠశాలకు వచ్చే క్రమంలో తాను భరించలేని ఒత్తిడికి గురయ్యానని కూడా విద్యార్థి చెప్పినట్లు నివేదికలో ఆమె పేర్కొంది.
ఆమె దిగేటప్పుడు విద్యార్థి వద్ద ప్రయాణానికి డబ్బు లేకపోవటంతో రూ.10 ఇచ్చిందని, అతను ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయిన కాసేపటికి ఈ విషాదాంతం వెలుగులోకి వచ్చినట్లు ఆమె తెలిపింది.
సూసైడ్ నోట్‌లో వేధింపుల ఆరోపణలు
పోలీసుల చేతిలో ఉన్న విద్యార్థి వ్యక్తిగత నోట్‌లో ఉపాధ్యాయుల చేత అవమానాలు ఎదుర్కొన్న క్రమాన్ని వెల్లడించాడు.. కొన్ని నెలలుగా తనపై కొనసాగిన వేధింపుల పర్వాన్ని వివరించాడు. అందులో నలుగురు ఉపాధ్యాయుల పేర్లు కూడా రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసు చర్యలు, పాఠశాల స్పందన
విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో ముడిపడినట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్ననలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం.


