శివాజీనగర: రాష్ట్రంలోని 319 గెజిటెడ్ ప్రొబేషనరీ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 15న ఆదివారం కేపీఎస్‌సీ ఆధ్వర్యంలో ప్రిలిమినరీ పరీక్షలు జరగనుండగా, సీఎం డీకే శివకుమార్ సమీక్ష జరిపారు. పరీక్షా సిబ్బందికి ఎన్నికల తరహాలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. గురువారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో పరీక్ష ఏర్పాట్లపై అధికారులు, పోలీసులతో చర్చించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సక్రమంగా జరపాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణను మెరుగుపరిచినట్లు, కేపీఎస్‌సీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. గట్టి భద్రత ఉండాలని, పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలచే నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
15న 319 పోస్టులకు
కేపీఎస్‌సీ పరీక్షలు
కట్టుదిట్టంగా జరపాలని సీఎం డీకే ఆదేశం
ఒక్కో గదికి ఇద్దరు పర్యవేక్షకులు
ప్రతి సిబ్బందిని, అభ్యర్థిని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలకు పంపాలని సీఎం తెలిపారు. లోపలకు మొబైల్ ఫోన్లను, ఇతరత్రా ఉపకరణాలను అనుమతించరాదన్నారు. లోపాలు జరిగితే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. మొదటిసారిగా ఒక్కో గదికి ఇద్దరు పర్యవేక్షకులను నియమించినట్లు చెప్పారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలతో భద్రత కల్పించాలన్నారు. రెండు మూడు దశల్లో అభ్యర్థులను తనిఖీ చేయాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ కళాశాలల లైసెన్సులను రద్దు చేస్తామని చెప్పారు. వదంతుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, సోషల్ మీడియాపై నిఘా వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.


