మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటెలో వెలసిన చెలువనారాయణస్వామి ఆలయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆలయ అర్చకులు, వైష్ణవ స్వాములు ఆమెకు ఏకరువు పెట్టారు.
ఇల్లు కట్టుకోకూడదట
వేల సంవత్సరాలుగా మేలుకోట ఆలయానికి 100 మీటర్ల పరిధిలో నివసిస్తున్న భూముల గురించి కేంద్ర పురావస్తు శాఖ సమస్యలు సృష్టిస్తోందని తెలిపారు. మాకు సొంత భూమి ఉన్నప్పటికీ, ఇళ్లు కట్టుకోవడానికి, మరమ్మతులు చేసుకోనివ్వడం లేదని వాపోయారు. భారతదేశంలోని గొప్ప వైష్ణవ ఆలయాన్ని పరిరక్షిస్తూ, సేవలు చేస్తున్న తాము అభద్రతతో జీవిస్తున్నామని అర్చకులు గోడు వెళ్లబోసుకున్నారు. ఆలయానికి 100 మీటర్ల పరిధిలో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతించడం లేదు, కానీ తరతరాలుగా ఉన్న తమ పాత ఇళ్లకు మరమ్మతులు చేసుకోవడానికి, పునర్నిర్మాణానికి కూడా ఒప్పుకోవడం లేదు, తాము తీవ్ర సంకటంతో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో శిథిలావస్థలో ఉన్న గోపురాలను పునరుద్ధరించాలని కోరారు.
కేంద్రమంత్రి నిర్మలమ్మతో మేలుకోటె అర్చకుల ఆవేదన
తమ ఇళ్లు, ఆలయ పనులకు పురావస్తు శాఖ అడ్డుపడుతోందని ఫిర్యాదు
పరిష్కారానికి కేంద్రమంత్రి భరోసా
ఒక్కసారి ఢిల్లీకి రండి
ఆలకించిన కేంద్రమంత్రి.. అందరూ పురావస్తు శాఖకు పిటిషన్లు పెట్టండి, వీలైతే, మీరు వెంటనే ఢిల్లీలోని నా కార్యాలయానికి రావాలి. కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని తెలిపారు. ఆలయ జీర్ణోద్ధరణ, భక్తులకు సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు. స్థానాచార్య శ్రీనివాసనరసింహన్, పరిచారక పార్థసారథి, స్థానికం ముకుందన్ ప్రసన్నకుమార్, విద్వాన్ ఆనందాళ్వార్, వరదరాజస్వామి తదితరులు పాల్గొన్నారు. తరువాత కేంద్రమంత్రి మైసూరుకు వెళ్లి ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.


