400 మంది కానిస్టేబుళ్ల నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు
నాలుగు నెలల్లో భర్తీచేయాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. 2022 నియామక నోటిఫికేషన్‌కు సంబంధించి మిగిలిపోయిన దాదాపు 400 పోస్టులను మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిన ఖాళీలు రద్దవుతాయని పేర్కొన్న నోటిఫికేషన్‌లోని క్లాజ్ 33 (ఐగీ)ను ఏకపక్షమైనదిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించింది. నాలుగు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు వెలువరించారు.
కేసు వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతించగా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 28.11.2022న ఆ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష ముగిసిన తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేశారు. అయితే, సర్టిఫికెట్ల పరిశీలన, అభ్యర్థుల పూర్వాపరాల విచారణ, వైద్య పరీక్షల దశలో కొందరు అభ్యర్థులు ఇతర ఉద్యోగాలకు ఎంపికవడం లేదా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో దాదాపు 400 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
ఈ మిగిలిన పోయిన ఖాళీలను మెరిట్ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న తమతో భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును కోరారు. నోటిఫికేషన్‌లోని క్లాజ్ 33(ఐగీ) ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిన ఖాళీలు రద్దవుతాయని అధికారులు స్పష్టంచేశారు. దీంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ‘నియామక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అభ్యర్థులు విధుల్లో చేరకపోతేనే ఆ ఖాళీలను తదుపరి నోటిఫికేషన్‌కు బదిలీ చేయాలి.
ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నంత మాత్రాన ఏకపక్ష నిబంధనలను ప్రశ్నించే హక్కును అభ్యర్థులు కోల్పోరు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యంలో, ఆసక్తి లేని అభ్యర్థులు తప్పుకున్నందుకు ప్రతిభావంతులను పక్కనపెట్టడం అన్యాయం. నోటిఫికేషన్ నిబంధనలు ఖాళీల భర్తీకి తోడ్పడేవిగా ఉండాలే తప్ప, ఆ లక్ష్యానికే విరుద్ధంగా ఉండకూడదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంచేశారు.


