● ఎన్నికలకు వెళ్లే దమ్ములేక బెదిరింపులు..
● ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు : నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, నారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలు కలిసి సొంతంగా ‘దేవగుడి రాజ్యాంగం’నడిపిస్తున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయా, లేక దేవగుడి రాజ్యాంగం నడుస్తోందా అన్నది ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. శనివారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఒక్కటీ లేదని, అందుకే ఎన్నికలకు వెళ్లే దమ్ములేక దౌర్జన్యాలకు తెగబడుతోందని మండిపడ్డారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయవద్దంటూ స్వయంగా పోలీసులే గ్రామాల వారీగా ఫోన్లు చేసి భయపెడుతున్నారని ఆరోపించారు.
పోలీసుల ముందే మహిళలపై దాడి..
మోరగుడి, ఎస్.ఉప్పలపాడులో హైకోర్టు ఆదేశాల కాపీని సీఐకి పంపిన తర్వాతే శనివారం సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లకు వెళ్తే, ఎస్‌ఐ, పోలీసుల సమక్షంలోనే కూటమి నేతలు మహిళలపై దాడి చేసి నామినేషన్ పత్రాలను చించివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.చింతకుంటలో మహిళా సర్పంచ్ అభ్యర్థి విజయలక్ష్మితో పాటు మరో మహిళపై దాడికి పాల్పడ్డారని, ముద్దనూరు మండల కేంద్రంలోనూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు : దేవగుడి, ధర్మాపురం క్లస్టర్లలో అరాచకాలు జరుగుతున్నందున వాటిని మార్చాలని ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
రెట్టింపు అనుభవిస్తారు.. జాగ్రత్త!
దేవగుడి కుటుంబం అండతో కూటమి నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, రాబోయేది కచ్చితంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు చేస్తున్న దౌర్జన్యాలకు రెట్టింపు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పొన్నపురెడ్డి వెంకట శివారెడ్డి, సుధాకర రెడ్డి, బాస్కర్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు.


