వీరబ్రహ్మేంద్రస్వామి... సదాస్మరామి | - | Sakshi
Sakshi News home page

వీరబ్రహ్మేంద్రస్వామి... సదాస్మరామి

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

● ఘనంగా జయంత్యుత్సవాలు

● వైభవంగా కలశోత్సవం

బ్రహ్మంగారిమఠం : కలియుగ ధర్మాన్ని, భవిష్యత్‌ దర్శనాన్ని ’కాలజ్ఞానం’ రూపంలో మానవాళికి అందించిన యుగపురుషుడు జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 418వ (అష్టాదశోత్తర చతుశ్శత) జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, వేదస్వస్తి పారాయణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామివారి 418వ జయంతిని పురస్కరించుకుని 418 కలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠం పురవీధుల్లో కలశాల ఊరేగింపు కనులవిందుగా సాగింది. ఉద్యానవనంలోని స్వామివారి శిలా విగ్రహానికి మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వేంకటాద్రిస్వామి, ఉమాదేవి దంపతులు క్షీరాభిషేకం నిర్వహించారు.

కమనీయంగా కల్యాణ ఘట్టం

సాయంత్రం మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వాముల వారి కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ శాఖ తరఫున మహానంది ఆలయ ఏఈవో ఎర్రమల మధు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే ఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ సిద్ధాంతి ఇడమకంటి జనార్దనాచార్యులు, ప్రధాన అర్చకులు వీరబ్రహ్మయాచారి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో బ్రహ్మంగారిమఠం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మఠం మేనేజర్‌ పీపీఎన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అల్పాహారం, అన్నదాన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మఠాధిపతి సోదరులు దత్తాత్రేయస్వామి, రాధాదేవి దంపతులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement