కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

రాజంపేట : స్థానిక 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ఆవరణలో శనివారం రాత్రి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. టీటీడీ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, ఏఈవో రవికుమార్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు వినోద్‌కుమార్‌, హేమంత్‌కుమార్‌, ఏఈ వెంకటరెడ్డి, టీటీడీ వేదపండితులు, అర్చకస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బైకు ఢీకొని వృద్ధురాలి మృతి

కలసపాడు : స్థానిక పోలీసుస్టేషన్‌ సమీపంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద శనివారం ఉదయం ద్విచక్ర వాహనం ఢీకొని కొట్టెబాలమ్మ (60) అనే వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన వరుణ్‌ అనే యువకుడు బైక్‌లో తన స్వగ్రామం నుంచి కలసపాడుకు వస్తుండగా కలసపాడు గ్రామానికి చెందిన బాలమ్మను ఢీకొనడంతో కిందపడింది. తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సలహా మేరకు 108 వాహనంలో పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు కొట్టె వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీపీపీలో చోరీకి యత్నం

ఎర్రగుంట్ల : డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో శనివారం తెల్లవారుజామున చోరీకి యత్నం జరిగింది. వీవీ రెడ్డి కాలనీలోని ఏఎఫ్‌ అపార్ట్‌మెంట్‌లోకి ముసుగులు ధరించి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటి తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రాత్రి గస్తీ (బీట్‌) నిర్వహిస్తున్న విజిలెన్స్‌ సిబ్బంది గంగిరెడ్డి, పవన్‌కుమార్‌, రాముడు అక్కడికి చేరుకున్నారు. సిబ్బందిని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. దొంగల కదలికలన్నీ అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆర్టీపీపీ సీఈ సహకారంతో విజిలెన్స్‌ సీఐ నారాయణయాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలనీలో ఎక్స్‌–ఆర్మీ సిబ్బందితో నిఘా, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్లే చోరీ తప్పిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement