మిత్రుడిని బతికించి.. మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

మిత్రుడిని బతికించి.. మృత్యుఒడికి..

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

బి.కోడూరు : తోటి స్నేహితుడి ప్రాణాలను కాపాడేందుకు నదిలోకి దూకిన ఓ బీటెక్‌ విద్యార్థి, మిత్రుడిని బతికించి తాను మృత్యుఒడికి చేరిన విషాద ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన సూర లక్ష్మీరెడ్డి (22) మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

అసలేం జరిగిందంటే..

మరాటిపల్లెకు చెందిన సూర కమ్మిరెడ్డి, ఆదిలక్షుమ్మ దంపతుల కవల సంతానంలో రెండవ వాడైన లక్ష్మీరెడ్డి, గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని పారుల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి సమీపంలోని నదిలోకి ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా తోటి మిత్రుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండటాన్ని లక్ష్మీరెడ్డి గమనించాడు. వెంటనే స్నేహితుడిని రక్షించే క్రమంలో లక్ష్మీరెడ్డి కడుపులోకి నీళ్లు చేరి అతడు మునిగిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి ఒడ్డుకు చేర్చినా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆశలన్నీ ఆవిరయ్యాయంటూ..

మరికొద్ది నెలల్లో బీటెక్‌ పూర్తి చేసి, మంచి ఉద్యోగంతో ఇంటికి వస్తాడని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కుమారుడి మరణవార్త పిడుగుపాటులా మారింది. చేతికందిన కుమారుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని లక్ష్మీరెడ్డి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, కడసారి చూపు చూసుకునే భాగ్యం కల్పించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

కువైట్‌ నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం

అట్లూరు : ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన కోటా సుధాకర్‌ (40) మృతదేహం శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది. అట్లూరు మండలం ఎస్‌.వెంకటాపురంలోని ఉప్పుటూరు కాలనీకి చెందిన సుధాకర్‌ నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లారు. ఈ నెల 17న కువైట్‌లోని జహరా ప్రాంతంలో ఒక కంపెనీలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై మరణించారు.బంధువుల సహకారంతో ఆయన మృతదేహాన్ని శనివారం సాయంత్రం ఉప్పుటూరు కాలనీకి తీసుకొచ్చారు. సుధాకర్‌ మృతదేహాన్ని చూసి భార్య కళావతి, కుమార్తె, కుమారుడు బోరున విలపించారు.జీవనోపాధి కోసం వెళ్లిన సుధాకర్‌ విగతజీవిగా తిరిగి రావడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

● గుజరాత్‌లో నీట మునిగి విద్యార్థి దుర్మరణం

● మృతుడు బి.కోడూరు మండలం మరాటిపల్లె వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement