ముస్తాబాద్: సాహితీ ప్రపంచంలో కొత్తతారలు ఉద్భవిస్తున్నాయి. మానేరు, మూలవాగు తీరాన సాహితీ కుసుమాలు పురుడుపోసుకుంటున్నాయి. మానేరు ప్రాంతంలోని చిన్నారులు.. కవిత, కథలు రాస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సాహిత్య పోటీల్లో సత్తాచాటుతున్న ఈ బాల సాహీతివేత్తల విజయపరంపరపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
మానేరు తీరాన సాహితీ పరిమళాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొప్ప కవులు, కళాకారులు పుట్టారు. సినారె, గూడూరి సీతారాం, బహుభాషావేత్త నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్‌కుమార్, గరిపెల్లి అశోక్, దూడం నాంపెల్లి, జూకంటి జగన్నాథం, పత్తిపాక మోహన్, కందేపి రాణి తమ రచనలతో సమాజంపై ప్రభావం చూపారు. వారి వారసత్వాన్ని బాలకవులు, రచయితలు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ సాహితీ అకాడమీలో సత్తా
తెలంగాణ సాహితీ అకాడమీ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించింది. పద్య కవిత్వంలో ఎల్లారెడ్డిపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసునూరి దివ్యజ్యోతి రాసిన కవితకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. కథల పోటీల్లో ముస్తాబాద్ మండలం ఆవునూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జక్కుల శ్రావణి కథ తృతీయ బహుమతి గెలుచుకుంది. గంభీరావుపేట పాఠశాల విద్యార్థి ఆర్.లాస్య రాసిన శ్రీఅమ్మపలికిన ఆఖరి మాటశ్రీ కథకు ప్రోత్సాహక బహుమతి లభించింది. తెలంగాణ సాహితీ అకాడమీ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలల నుంచి 1450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 802 రచనలు అందాయి. ఇందులో కథలు 428, కవితలు 286 వచ్చాయి. బాలల ప్రపంచం–2026 పేరిట త్వరలో పుస్తకం రాబోతోంది. సారస్వత పరిషత్తు నిర్వహించిన పోటీల్లో దివ్యజ్యోతి, మీనాక్షి, హర్షిని, కార్తీక బహుమతులు సాధించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కే.వీ.రమణాచారి చేతుల మీదుగా అవార్డులు, బహుమతులు అందుకున్నారు. పద్య కవితలో పర్శ కుర్మ రిషిక శతకం రాసింది. రిషిక రాసిన శతకం అకాడమీ, పరిషత్తు బహుమతులు అందుకుంది.
పద్యం, కథా రచనలకు పురస్కారాలు
సాహిత్యంలో సత్తాచాటుతున్న చిన్నారులు


