ఫోన్‌లో పిలిచి... కత్తులతో నరికి.. | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో పిలిచి... కత్తులతో నరికి..

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

గోదావరిఖని: పాత స్నేహం.. వ్యక్తిగత విభేదాలుగా మారి చివరకు హత్యకు దారితీసింది. ఫోన్‌లో వాగ్వాదానికి దిగి, పథకం ప్రకారం పిలిపించి సింగరేణి కార్మికుడిని నడిరోడ్డుపై కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో కోల్‌బెల్ట్‌ ప్రాంతం ఉలిక్కిపడింది. గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన అట్ల రాజశేఖర్‌ (36) ఇందారం గనిలో కోల్‌కట్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున పవర్‌హౌస్‌ కాలనీ శివాలయం సమీపంలో హత్యకు గురయ్యాడు. ఆటో డ్రైవర్‌ ఎన్నం ప్రసాద్‌తో రాజశేఖర్‌కు గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఆరు నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఫోన్‌లో పరస్పరం దూషించుకోవడం, కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడుకోవడంతో ప్రసాద్‌ కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులైన ఎడ్లపల్లి శ్రవణ్‌కుమార్‌, ఐలి దేవేందర్‌, బోరె మల్లేష్‌తో కలిసి హత్యకు పథకం రచించాడు. ఆదివారం మరోసారి ఫోన్‌లో వాగ్వాదం జరగడంతో పథకం అమలుకు సిద్ధమయ్యారు. ప్రసాద్‌కు చెందిన ఆటోలో వెళ్లి పవర్‌హౌస్‌ కాలనీలోని బాలయ్య కిరాణం సమీపంలో మాటువేశారు. సోమవారం తెల్లవారుజామున మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాజశేఖర్‌ను అడ్డగించి కిందపడేశారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

12 గంటల్లోనే నిందితుల అరెస్ట్‌

రాజశేఖర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎన్నం ప్రసాద్‌తో పాటు ఎడ్లపల్లి శ్రవణ్‌కుమార్‌, బోరె మల్లేష్‌, ఐలి దేవేందర్‌లను 12 గంటల్లోనే అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ రామ్‌రెడ్డి తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటో, పెద్ద కత్తి, చిన్న కత్తి, మూడు సెల్‌ఫోన్లు, రక్తపు మరకలున్న టీషర్టును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వన్‌టౌన్‌ పోలీసులను డీసీపీ, ఏసీపీ అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాత స్నేహితుడితో విభేదాలే

హత్యకు కారణం

ద్విచక్రవాహనంపై వెళ్తుండగా

అడ్డగించి దాడి

సీసీ కెమెరాల్లో రికార్డైన హత్యోదంతం

12 గంటల్లోనే నలుగురు నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement