నేడు చైనాతో టైటిల్ పోరు
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2, జియో హాట్‌స్టార్‌లో
భోపాల్: మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ‘హ్యాట్రిక్’ టైటిల్ సాధించేందుకు భారత జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. వరుసగా మూడోసారి సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత్ 6–2 గోల్స్ తేడాతో మలేసియా జట్టును ఓడించింది. భారత్ తరఫున దీపిక (25వ, 30వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ముంతాజ్ ఖాన్ (10వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (18వ ని.లో), సునెలితా టొప్పో (33వ ని.లో), ఇషిక (57వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
మలేసియా జట్టు తరఫున నూర్ అజ్హర్ (27వ ని.లో), నూరామీరా (52వ ని.లో) ఒక్కోగోల్ చేశారు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో చైనా 1–0తో జపాన్‌పై గెలిచి నేడు జరిగే టైటిల్ పోరులో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. 2010లో మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా... భారత జట్టు మూడుసార్లు (2016, 2023, 2024) విజేతగా... రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌గా నిలిచింది.


